కవిత ప్రసంగంపై ఉత్కంఠ | Kalvakuntla Kavitha New Party Name Announcement News Updates | Sakshi
Sakshi News home page

Kavitha New Party: కవిత ప్రసంగంపై ఉత్కంఠ

Apr 25 2026 7:25 AM | Updated on Apr 25 2026 8:44 AM

Kalvakuntla Kavitha New Party Name Announcement News Updates

తెలంగాణలో మరో ప్రాంతీయ రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత ఇవాళ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ జెండా, ఎజెండాను శనివారం మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లో జరిగే సభలో ఆవిష్కరించనున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: సబ్బండ వర్గాల సంక్షేమం కోసం.. రేపటి తెలంగాణ భవిష్యత్తు కోసం.. కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం అనే ప్రచారంతో కవిత ముందుకు వచ్చారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట పార్టీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఉదయం 10గం. ఇందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.   

ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ కవిత పార్టీ ప్రకటన సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. నగరంలో పలు చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. కొత్త పార్టీ ప్రకటనకు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అద్వయ కన్వెన్షన్‌ ఇందుకు వేదిక కానుంది. 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా.. ప్రాంగణంకు సెంటిమెంట్‌గా ‘ప్రొఫెసర్ జయశంకర్ సార్‌’గా నామకరణం చేశారు. సభ కోసం వచ్చే శ్రేణుల కోసం భోజనాలు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేశారు.  

ఉదయం బంజారాహిల్స్‌ నివాసం నుంచి కవిత గన్ పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి సభకు ఆమె చేరుకోనున్నారు. పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరణ, ప్రసంగం అనంతరం తిరిగి ర్యాలీగా లిబర్టీ చౌరస్తాకు చేరుకుంటారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి బంజారాహిల్స్‌ నివాసానికి చేరుకుంటారు. 

తెలంగాణ ఉద్యమంతో.. 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్‌ బిడ్డగా కల్వకుంట్ల కవిత పోరాటంలో పాల్గొన్నారు. 2006లో ఉద్యమానికి సాంస్కృతిక కోణాన్ని జోడించి తెలంగాణ జాగృతిని నెలకొల్పారు. బతుకమ్మ సంబురాలతో సాంస్కృతికంగా, బీఆర్‌ఎస్‌ తరఫున రాజకీయ కార్యకలాపాల ద్వారా క్రియాశీలంగా పనిచేశారు. 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. 2020లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 మార్చిలో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో అరెస్టై సుమారు 5 నెలల పాటు ఢిల్లీ తీహార్‌లో జైలు జీవితం గడిపారు. ఆగస్టులో విడుదల కాగా.. ఇటీవలె సీబీఐ కోర్టు ఈ కేసులో ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 

కవిత ప్రసంగంపై ఉత్కంఠ.. 
బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాల నిర్వహణ, పార్టీ అధినేత ప్రసంగంలో లోపాలను ఎత్తిచూపుతూ తాను తండ్రికి రాసిన లేఖ లీక్‌ కావడంపై కవిత కిందటి ఏడాది మే నెలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లేఖ లీక్‌ కావడానికి కేసీఆర్‌ చుట్టూ చేరిన దెయ్యాలే కారణమంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి నుంచి పార్టీపై, నాయకత్వంపై విమర్శల డోసు పెంచుకుంటూ వచ్చారు. ఒకానొక టైంలో.. 

హరీష్‌రావు, సంతోష్‌రావు, జగదీశ్‌ రెడ్డిలపై విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె.. సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కూ చురకలు అంటించారు. దీంతో పార్టీ గీత దాటారన్న కారణం చెబుతూ బీఆర్‌ఎస్‌ సెప్టెంబర్‌ 2వ తేదీన ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ పరిణామంతో కలత చెందిన ఆమె.. పలు సంచలన విషయాలను వెల్లడిస్తూ కంటతడి నడుమ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన చేశారు. అప్పటి నుంచి రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారామె. మధ్యలో(అక్టోబర్‌లో) జాగృతి జనం బాట పేరిట నాలుగు నెలుల పాదయాత్ర చేశారు కూడా. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరుతో పాటు ఆమె ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. సుమారు గంటన్నర పాటు ఆమె మాట్లాడతారని సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement