 
													సాక్షి, కడప : రాజకీయంగా తనపై వస్తున్న ఆరోపణలను జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖండించారు. ఇటీవల మీడియాలో తన పైన వచ్చినవ వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. తాను కడప జిల్లాకు చెందిన వ్యక్తినని, తన భాష ఇలాగే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేకపోతే తనకు రాజకీయ భవిష్యత్తే లేదని, అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదని స్పష్టం చేశారు. తాను తొలినుంచీ వైఎస్సార్, జగన్ అభిమాని అని గుర్తుచేశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుతో తనను పోల్చడం దారుణమని, ఆయన అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థంకావడంలేదని అన్నారు. సీఎం జగన్‌కు తాను ఎప్పుడూ విధేయుడిగా ఉంటానని, ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తానని పేర్కొన్నారు.
మంగళవారం వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నాపై అసత్య ప్రచారాలు వద్దు. వైఎస్ కుటుంబాన్ని ఎదిరించినోళ్లు ఇంతవరకు ఎవరూ బాగుపడలేదు. రఘురామ కృష్ణంరాజు, ఆదినారాయణ రెడ్డి లాంటోళ్లే ఇళ్లలో కూర్చొని వున్నారు. జమ్మలమడుగులో నా గెలుపుకు కారణం ఎంపీ అవినాష్ రెడ్డే. అలాంటి కుటుంబాన్ని నేనెందుకు తిడతాను. నా మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. తుదిశ్వాస వరకు వైఎస్ కుటుంబానికి కార్యకర్తగానే ఉంటాను. ఇకనైనా నాపై అసత్య ప్రచారాలు మానుకోండి’ అని అన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
