ఈ పాపం టీడీపీదే

Involvement of TDP Leaders in affair of petition on housing scheme - Sakshi

ఇళ్ల పథకంపై పిటిషన్‌ వ్యవహారంలో ఆ పార్టీ పెద్దల ప్రమేయం

తెర ముందు పేర్లు జి.అమ్మేశ్వరరావు, మల్లేశ్వరరావు

లక్షల ఖర్చుతో హైకోర్టులో కేసు నడిపే స్థోమత వీరికి లేదు

ఇళ్ల పథకాన్ని ఆపేందుకే తెర వెనుక ప్రముఖుల పాత్ర

గతంలో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని తీసుకున్న అర్జీలలోని పత్రాలతో తప్పుడు పిటిషన్‌ 

తమకేపాపం తెలియదని లబోదిబోమంటున్న బాధితులు

తమ పేరుతో తప్పుడు కేసు వేశారని పోలీసులకు ఫిర్యాదు

చనిపోయిన ఓ మహిళ ఎలా పిటిషన్‌ వేస్తుంది?

గుట్టు వీడుతున్న వ్యవహారం.. టీడీపీ నేతల్లో గుబులు

సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, తెనాలి రూరల్‌: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన వ్యవహారంలో తెరపై సూత్రధారులు తెనాలి కొత్తపేటకు చెందిన జి.అమ్మేశ్వరరావు, మల్లేశ్వరరావులు కాగా, తెరవెనుక టీడీపీ ప్రముఖులు కథ నడిపినట్లు స్పష్టమవుతోంది. పిటిషన్లు వేయడానికి కారణమైన వీరిద్దరికి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో ఓ కార్మిక సంఘంలో పని చేసిన అమ్మేశ్వరరావుతో పాటు ఒక కుల సంఘం నేతగా ఉన్న ఎం.మల్లేశ్వరరావులు పేదలకు ఇళ్ల స్థలాలను ఇప్పిస్తామని నమ్మబలికి, వారి నుంచి ధృవీకరణ పత్రాలు, సంతకాలు సేకరించారు. వీటి ద్వారా 2016లో అప్పటి మండల తహశీల్దారుపై అమ్మేశ్వరరావు హైకోర్టులో కేసు వేశారు. అదే కేసులో పిటిషనుదారుల్లో చాలా మంది పేర్లతో మళ్లీ గత డిసెంబర్‌లో పేదలందరికీ ఇళ్లు పథకంపై పిటిషను దాఖలు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన సివిల్‌ న్యాయవాదికి తాను ఈ పత్రాలు ఇచ్చినట్టు అమ్మేశ్వరరావు స్థానికుల వద్ద అంగీకరించాడు. అదేమని అడిగితే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం సరిపోదని, అందుకే హైదరాబాద్‌లో సివిల్‌ న్యాయవాదికి ఇచ్చి పిటిషన్‌ వేయించినట్టు చెబుతున్నాడు. ‘మీ అంతట మీరే కేసు వేశారా? ఎవరి ప్రోద్భలమైనా ఉందా? ఇళ్ల స్థలాల అర్జీలకంటూ సంతకాలు తీసుకుని, వారి పేర్లతో పిటిషన్‌ వేయటం ఏమిటి’ అన్న బాధితుల ప్రశ్నలకు అతను సమాధానం ఇవ్వడం లేదు. కొత్తపేటలోని పట్టాభి రోడ్డులో డ్రైనేజి కాలువ పక్కన చిన్న ఇంటిలో నివసించే అమ్మేశ్వరరావు.. హైకోర్టు లాయరుకు భారీ ఫీజులు చెల్లించి.. కోర్టులో పిటిషన్‌ వేసేంత స్థోమత లేదని స్థానికులు చెబుతున్నారు.

ఈ కేసు కోసం సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న అమ్మేశ్వరరావుకు ఆ పార్టీకి చెందిన పెద్దలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. టీడీపీ పెద్దలు తెరవెనుక నుంచి ఇచ్చిన సూచనల మేరకు కొంత మంది ఆ పార్టీ నేతల ద్వారా ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం. అయితే పిటిషన్‌ వేసిన వారిలో మృతి చెందిన మహిళ ఉండటం, పేర్లు సరిచూసుకోక పోవడం తదితర కారణాల వల్ల ఇట్టే దొరికి పోవాల్సి వస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 
గుంటూరు జిల్లా తెనాలిలో జి.అమ్మేశ్వరరావు నివసిస్తున్న ఇల్లు   

మాకు ఏ పాపం తెలియదు
‘మేం తెనాలి చంద్రబాబుకాలనీ వాసులం. మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా మా సంతకాలు ఫోర్జరీ చేసి గౌరవ హైకోర్టులో మాకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి కేసు వేసి స్టే ఉత్తర్వులు తీసుకున్నట్లు మాకు టీవీలు, పేపర్ల ద్వారా తెలిసింది. నాలుగేళ్ల క్రితం గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావులు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటే ఆధార్‌కార్డులు, రేషన్‌ కార్డు జిరాక్స్‌లు ఇచ్చాము. తర్వాత ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేయలేదు. మాకు తెలియకుండా మా వివరాలతో కేసు వేసిన కుట్రదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోండి’ అంటూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తుమ్మపూడి అశోక్‌కుమార్, పరుచూరు బేబీ సరోజిని, కొండా నాగమంజుల, కనికరం రాంబాబు, శేని సత్యవతి, ఎస్‌ లీలాప్రసాద్, చనగవరపు శివకుమారి, షేక్‌ జిలాని, భీమిశెట్టి రామ్మోహన్‌రావు తదితరులు తెనాలి త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. 

కుట్రదారులను విచారించండి
ఈ ప్రభుత్వ వచ్చిన తర్వాత ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ పథకంలో భాగంగా తమకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని, స్థలాన్ని తమకు స్వాధీనం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇళ్ల స్థలాల కోసం ఏ కోర్టులోనూ ఎటువంటి కేసులు వేయలేదని, ఏ ప్లీడర్‌ను కలవలేదని ఫిర్యాదులో వివరించారు. తమ వద్ద నుంచి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు తీసుకున్న గుండెమెడ అమ్మేశ్వరరావు, ఎం. మల్లేశ్వరరావు వారి రాజకీయ స్వలాభం కోసం తమ సంతకాలు ఫోర్జరీ చేసి హైకోర్టులో వేసిన ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కుట్రకు పాల్పడిందెవరో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. 

పేదల్లో కలవరం
పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 369, జీవో 488, జీవో 99లను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబర్‌లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తి మల్లవోలు సత్యనారాయణమూర్తి ఈనెల 8న ఇళ్ల పథకానికి బ్రేక్‌ వేస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న పొదిలి శివమురళి ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

ఇళ్ల పథకాన్ని నిలిపివేయమని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తెనాలివాసుల పేర్లు ఉన్నాయన్న సమాచారం చాలా మంది పేదల్లో కలవరం కలిగించింది. పలువురు తమ పేరు ఉందేమోనన్న ఆందోళనతో పట్టణ 23వ వార్డులోని సచివాలయానికి వెళ్లారు. పిటిషనులో తమ పేర్లు ఉన్నాయేమో చూడాలని సచివాలయం సిబ్బందిని కోరారు. పిటిషన్‌లో పేర్లు లేని మరికొంత మంది కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అమ్మేశ్వరరావుకు డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. చాలాసార్లు అతడి కోసం తిరిగి, ఆశలు వదిలేసుకున్నామని మీడియాకు తెలిపారు. 

పిటిషన్లో చనిపోయిన మహిళ పేరు 
ఇళ్ల స్థలాలపై హైకోర్టులో వేసిన పిటిషన్‌లో తెనాలికి చెందిన కొండెం ప్రమీల పేరు ఉంది. ఈ పిటిషన్‌ను గత ఏడాది డిసెంబర్‌లో వేశారు. అయితే కొండెం ప్రమీల అనారోగ్యంతో గత ఏడాది మార్చి 4వ తేదీ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. చనిపోయిన ఈమె ఎలా పిటిషన్‌ వేస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో ఇద్దరి పేర్లు రిపీట్‌ అవ్వగా, కొందరి అడ్రస్‌లు తప్పుడువి ఇచ్చారు. చాలా మంది పిటిషన్‌లో పేర్కొన్న చిరునామాలలో ఉండటం లేదు. తొలుత ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టగానే తెలుగుదేశం నేతలు భుజాలు తడుముకోవడం పలు అనుమానాలకు దారితీసింది. పిటిషన్‌ దారుల్లో మొదటి వ్యక్తిగా చెబుతున్న పొదిలి శివమురళి తాను తమ కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఆధార్‌కార్డు ఇచ్చానని చెబితే, తెనాలి ఎమ్మెల్యే పేరు చెప్పినట్లుగా వక్రీకరిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా విలేకరుల సమావేశం పెట్టడంతో ఇందులో తెలుగుదేశం నాయకుల పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. 

కేసు వేయించింది ఆలపాటి రాజాయే
– తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ మండిపాటు
ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టులో కేసు వేయించింది మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా అని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మండిపడ్డారు. ఇళ్ల స్థలాల పథకంపై హైకోర్టును ఆశ్రయించిన పిటిషనుదారుల్లో ప్రథముడైన పొదిలి శివమురళి వీడియో సాక్షిగా చెప్పిన అంశాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా వక్రీకరించి, తనకు ఆపాదించాలని చూశారని విమర్శించారు. రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం ద్వారా తెనాలిలో ఇక తనకు స్థానం లేదన్న దుగ్ధతో ఆలపాటి రాజానే ఈ కేసు వేయించారని చెప్పారు. దీని వెనుక ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాలనే భారీ కుట్ర ఉందంటూ బుధవారం విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు. ముందుగా పిటిషనుదారుల్లో ఒకరైన పొదిలి శివమురళి మాట్లాడిన వీడియోను, దాని ఆధారంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆలపాటి రాజా ప్రెస్‌మీట్‌ వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు.

తాను నాయీబ్రాహ్మణ కులస్తుడినని, తన కులపెద్ద ఎం.మల్లేశ్వరరావుకు ఇళ్ల స్థలాల కోసమని డబ్బులు, ధృవీకరణ పత్రాలు ఇచ్చానని శివమురళి చెబితే, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ఇచ్చానని చెప్పాడంటూ రాజా తనపై ఆరోపణ చేయటం ఏమిటని శివకుమార్‌ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలను అడ్డుకునే కుట్ర టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే పురుడుపోసుకుందని చెప్పారు. పంచాయతీ కార్యాలయాలపై పార్టీ రంగులు తొలగించాలంటూ టీడీపీకి చెందిన వెంకట్రావుతో కేసు వేయించిందీ రాజానేనని చెప్పారు. క్రిమినల్‌ మైండ్‌ కలిగిన రాజా, కోర్టుల్లో తనకు అపారమైన పలుకుబడి ఉందని చెప్పుకుంటూ, సెటిల్‌మెంట్లు చేయటం అలవాటని ఆరోపించారు. టీడీపీకి చెందిన నన్నపనేని సుధాకర్‌ దగ్గర కోర్టు కేసు విషయంలో రాజా రూ.25 లక్షలు తీసుకున్నాడని తాను ఏడాది క్రితం ఆరోపించినట్టు ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత రెండు నెలలకు రూ.10 లక్షలు తిరిగి ఇచ్చాడనే విషయాన్ని సుధాకర్‌ స్వయంగా తనకు చెప్పారని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top