
సాక్షి, తాడేపల్లి: సిట్ భేతాళ కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేకపోయిందన్నారు.
‘‘కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు చాలామందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నాయకుల అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసును నడిపిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు కోర్టు ముందు నిలపడవు. తాత్కాలికంగా మా నాయకులను వేధించవచ్చునేమోగానీ న్యాయ పరీక్షకు కేసు నిలపడదు’’ అని మనోహర్‌రెడ్డి తేల్చి చెప్పారు.
మా పార్టీ ముఖ్య నేతలను కేసులో ఇరికించటానికే కేసును నడుపుతున్నారు. సిట్ ఓవరాక్షన్ చేస్తోంది. సిట్ బెదిరింపులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. రూ.11 కోట్లు చూపించి లిక్కర్ కేసులోని డబ్బంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందని జగన్ నమ్ముతారు. అన్యాయం మీద న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుంది. మా నాయకులకు బెయిల్ రానీయకుండా ఉండేందుకు ఛార్జిషీటు వేయకుండా ఆలస్యం చేశారు. బాలాజీగోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈరోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్ రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్‌రెడ్డి చెప్పారు.