
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ తప్పుడు విధానాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన ప్రతిసారీ అక్రమ కేసులు, తప్పుడు అరెస్ట్‌లతో కూటమి ప్రభుత్వం డైవర్షన్‌కు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల్లో ముగ్గురు సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు కనిపించకుండా పోయారని.. హెబియస్ కార్ఫస్ పిటీషన్ వేస్తే ఒకరిని తాము అరెస్ట్ చేసినట్లు పోలీసులు హైకోర్టు ఎదుట హాజరుపరిచారని తెలిపారు.
మిగిలిన ఇద్దరిని కూడా మఫ్టీలో వచ్చిన పోలీసులే తమతో తీసుకువెళ్ళారని, వారి కుటుంబసభ్యులకు ఎటువంటి సమాచారం చెప్పకుండా వేధిస్తున్నారని అన్నారు. అరెస్ట్ చేసిన వారిపై కుట్రపూరితంగా గంజాయి కేసులు పెట్టి, జైళ్ల నుంచి బయటకు రానివ్వకుండా చేయాలనే కుట్రతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు చట్టాలను అపహాస్యం చేస్తూ, ప్రశ్నించే గొంతులను నులిమేసేందుకు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..
కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారే కారణంతో సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కక్షసాధింపుతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైన ప్రతి సందర్భంలోనూ డైవర్షన్ పాలిటిక్స్‌కు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేయడం, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను అరెస్ట్ చేసి హంగామా సృష్టించడం చేస్తోంది. తాజాగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంతో ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో దానిని డైవర్ట్ చేయడానికి మరోసారి పోలీసులను ప్రయోగించి సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై అన్యాయంగా కేసులు పెట్టడం తిరిగి ప్రారంభించారు.
గతంలో జరిగిన ఘటనలను చూపుతూ తప్పుడు కేసులు పెడుతున్నారు. దీనిలో భాగంగానే సోషల్ మీడియా యాక్టివీస్ట్ సవీంద్రారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. సోషల్ మీడియా పోస్ట్‌లకు బదులుగా కొత్త కేసులను నమోదు చేసి, న్యాయస్థానాలను కూడ బురిడీ కొట్టించేందుకు సిద్దపడ్డారు. పాతూరులో జ్యూస్ షాప్ నడుపుకుంటున్న సవీంద్రారెడ్డిని పోలీసులు మఫ్టీలో బ్లూ కలర్ కార్‌లో వచ్చి, అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆయన కారును కూడా పోలీసులు తమతో పాటు తీసుకువెళ్ళారు. సవీంద్రారెడ్డిని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియక ఆయన భార్య తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే 100 నెంబర్‌కు ఏడుసార్లు ఫోన్ చేసినా కూడా స్పందన రాలేదు. దీనిపై మరుసటి రోజు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేయడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
సవీంద్రారెడ్డి ఆచూకీ కనుక్కొని కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే సవీంద్రారెడ్డి పోలీసుల ఆధీనంలో లేరని, పోలీసులు అరెస్ట్ చేయలేదని, ఒకవేళ ఏదైనా ఇతర కేసుల్లో వేరేచోట ఆయనను అరెస్ట్ చేసి ఉంటే, సంబంధిత కోర్ట్‌ల పరిధిలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది చెప్పాడు. దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రంలో ఏ కోర్టు పరిధిలోనూ అతడిని హాజరుపరచడానికి వీలులేదు, హైకోర్టులోనే హాజరుపరచాలని చాలా స్పష్టంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో పత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో సవీంద్రారెడ్డిపై గంజాయి కేసు నమోదు చేసి, గుంటూరు కోర్ట్‌లో దాదాపు అదే సమయానికి హాజరుపరిచారు. హైకోర్టు ఆదేశాలను తెలుసుకున్న గుంటూరు మేజిస్ట్రేట్ రిమాండ్‌కు పంపకుండా, ఈ రోజు హైకోర్టులో హాజరుపరచాలని సూచించింది.
హైకోర్టులో సవీంద్రారెడ్డి తనపట్ల పోలీసులు వ్యవహరించిన తీరును, తనపై అక్రమంగా గంజాయి కేసు బనాయించారని, రిమాండ్ రిపోర్ట్‌ను కూడా పరిశీలించాలని విన్నవించుకున్నారు. రిమాండ్ రిపోర్ట్‌ను చూసిన హైకోర్టు సైతం దీనిపై విస్మయం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసే సందర్భంలో నిబంధనలను ఎందుకు పాటించలేదు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్‌ను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించింది. తాడేపల్లిలో రాత్రి ఏడు గంటలకు సవీంద్రారెడ్డి కనిపించడం లేదని ఆయన భార్య రిపోర్ట్ ఇచ్చిందని, పత్తిపాడులో ఏడున్నరకు ఆయనను అరెస్ట్ చేసినట్లు ఎలా చూపించారంటూ కోర్టు ప్రశ్నించింది. నిజాలు తెలుసుకునేందుకు తాడేపల్లి సీసీటీవీ ఫుటేజీని, అలాగే సవీంద్రారెడ్డికి సంబంధించి ఈనెల 22, 23 తేదీలకు గానూ సెల్‌ఫోన్ టవర్స్‌ను ట్రాక్ చేయాలని, ఆయన జియో కంపెనీ సిమ్ ఉపయోగించిన నేపథ్యంలో ఆ సంస్థ జీఎంను కూడా పార్టీగా చేరుస్తూ ఆదేశించింది.
మరో ఇద్దరు సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో మరో ఇద్దరు సోషల్ మీడియా యాక్టివీస్ట్ లను పోలీసులు మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకున్నారు. తాడేపల్లిలో తారక్ అనే సోషల్ మీడియా యాక్టివీస్ట్ ఉదయం గుంటూరు నుంచి తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వస్తుండగా కనిపించకుండా పోయాడు. మణిపాల్ ఆసుపత్రి వద్ద తనను పికప్ చేసుకోవాలని తన స్నేహితుడికి ఫోన్ చేసిన తారక్ అక్కడ కనిపించలేదని ఆయన స్నేహితుడు చెబుతున్నారు. ఆయన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉంది. ఆయన తల్లిదండ్రులు గుంటూరులోని పాతూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు దానిని తీసుకోలేదు. కనీసం పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు.
మఫ్టీలో వచ్చిన పోలీసులే తారక్‌ను అదుపులోకి తీసుకుని, కనీసం ఆ విషయాన్ని వారి కుటుంబసభ్యులకు కూడా తెలియకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. అలాగే అనంతపురంలో సూర్యభార్గవ్ అనే వ్యక్తి ఇంటికి పోలీసులు వెళ్ళి నాలుగైదు గంటల పాటు విచారించి, తమ వెంట తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు ఆయనను ఎక్కడకు తీసుకువెళ్లారో సమాచారం ఇవ్వడం లేదు. సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను వేరే మార్గాల్లో తప్పుడు కేసులు పెట్టి, సులభంగా జైలు నుంచి బయటకు రానివ్వకుండా గంజాయి వంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.
ఇటువంటి దుష్ట సంప్రదాయానికి తెగబడుతున్నారు. చట్టాలంటే గౌరవం, న్యాయస్థానాలు అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరికి పత్రికా విలేకరులపైన కూడా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సాక్షి పత్రికకు చెందని ఎడిటర్‌తో సహా పలువురిపై ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశారు. సాక్షి కార్యాలయాలపైన దాడులకు తెగబడిన వారికి పోలీసులు కొమ్మకాస్తున్నారు. చివరికి వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులపై కూడా అక్రమ కేసులు బనాయించేందుకు తెగబడుతున్నారు. వీటన్నింటికీ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ పెద్దలు, తప్పు చేసిన పోలీసులు కోర్టుల ముందు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది.