
సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని అడ్డుకునేందుకు జేసీ వర్గీయులు ప్రయత్నించబోయారు. ఈ క్రమంలో పోలీసుల జోక్యంతో పరిస్థితి ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది.
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే.. కేతిరెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వనంటూ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే పోలీసులు సైతం.. పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
అయినా జేసీ వర్గీయులు శాంతించలేదు. వైఎస్సార్‌సీపీ సమావేశ వేదిక వద్దకు జేసీ నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. వాళ్లను అడ్డుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అంతకు ముందు.. సమావేశానికి హాజరయ్యేందుకు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి బయలుదేరారు. పెద్దారెడ్డి రాకపై అప్రమత్తమైన పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశానికి అనుమతి ఉందంటూనే.. పెద్దారెడ్డి మాత్రం వచ్చేందుకు వీలులేదని ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్సార్‌సీపీ నేతలు కావచ్చంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ తనపై పోలీసులు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డికి నేనంటే భయం: కేతిరెడ్డి పెద్దారెడ్డి
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే పోలీసుల ద్వారా నన్ను అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ
తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తున్న తనను అడ్డుకోవడం దుర్మార్గం.18వ తేదీన అనుమతిచ్చి.. ఇప్పుడు వెళ్లొద్దంటే ఎలా?. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చి మూడు మాసాలవుతోంది. తాడిపత్రి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.