ఉదయం దీక్ష.. మధ్యాహ్నం ఫైట్‌!

High drama of BJP leaders Somu Veerraju - Sakshi

బీజేపీ నేతల హైడ్రామా

పోలీసులతో ఘర్షణ

సోము వీర్రాజు సహా 35 మంది అరెస్టు

సాక్షి, అమరావతి/ఉయ్యూరు (పెనమలూరు)/గుడివాడ/ఉంగుటూరు (గన్నవరం): ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆ పార్టీ నేతలు  మంగళవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఎంపీ సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు  సూర్యనారాయణ రాజు, విష్ణువర్దన్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగులను ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకొచ్చిందని సోము వీర్రాజు ఆరోపించారు. కాగా,  దీక్షను మధ్యాహ్నానికి విరమించి, బీజేపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామంటూ సోము నేతృత్వంలో పార్టీ నేతలు గుడివాడకు బయలుదేరి వెళ్లారు. 

నందమూరు అడ్డరోడ్డు వద్ద హైడ్రామా
గుడివాడలో సంక్రాంతి సంబరాలను టీడీపీ వివాదాస్పదంగా మార్చింది. దీనికి వంతపాడుతూ గుడివాడ పర్యటనకు బయలుదేరిన బీజేపీ నాయకులను నందమూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి, సీఎం రమేష్‌ సహా 35 మంది బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ శ్రేణులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి, ఘర్షణకు దిగారు. వీర్రాజుతో పాటు 18 మందిని ఉంగుటూరు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. వీర్రాజు మాట్లాడుతూ.. తాము చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకున్నా అరెస్టు చేయడం దారుణమన్నారు.

ఎందుకు అడ్డుకున్నారు?
  బీజేపీ ఎంపీ జీవీఎల్‌ 
సాక్షి, న్యూఢిల్లీ: సంక్రాంతి కార్యక్రమాల ముగింపు వేడుకలకు కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం గుడివాడ వెళ్తుంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అసలు బీజేపీ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారని, అరెస్ట్‌ చేసి బయటకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసుల ప్రవర్తన చూస్తే ఎంత అరాచకంగా వ్యవహరించారో తెలిసిపోతుందన్నారు. ముగ్గుల పోటీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలంటే వైఎస్సార్‌సీపీ నేతలకు చేదా అని అడిగారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top