సాక్షి, తాడేపల్లి: మోసాలు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా పెన్షన్లు ఇస్తానంటూ మోసానికి దిగారని.. దశల వారీగా పెన్షన్లు ఇస్తానంటూ మభ్యపెట్టటం మొదలు పెట్టారంటూ ఆయన దుయ్యబట్టారు.
‘‘66 లక్షల మందికి వైఎస్ జగన్ హయాంలో పెన్షన్లు ఇచ్చారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు. చంద్రబాబు 59 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. రెండేళ్లలోనే చంద్రబాబు 6.5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఈ రెండేళ్లుగా పడిన బకాయితో కలిపి పెన్షన్లు ఇవ్వాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
‘‘వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన ఇళ్లనే చంద్రబాబు ఆపేశారు. ఇప్పుడు కొత్తగా ఐదు లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామంటున్నారు. అసైన్డ్ భూముల విషయంలోనూ చంద్రబాబు అదే మోసానికి దిగారు. 20 ఏళ్లుగా అసైనీలుగా ఉన్న వారికే జగన్ పూర్తి హక్కులు కల్పించారు.
..చంద్రబాబు వచ్చాక ఆ జీవోని అమలు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అవే భూములను తాను ఫ్రీహోల్డ్ చేయబోతున్నట్లు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. చుక్కల భూములు, 22ఏ భూముల సమస్యలకు కూడా వైఎస్ జగన్ హయాంలో పరిష్కారం చూపారు. భూ సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ చేసిన కృషి మరెవ్వరూ చేయలేదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్‌మెంట్‌లో గోల్‌మాల్!


