ఆప్‌ వర్సెస్‌ ఎల్జీ: పాజిటివిటీ రేట్‌ తగ్గుతోందన్న సర్కార్‌.. జాన్తా నై అంటోన్న ఎల్జీ

Delhi LG Rejects AAP Govt Weekend Curfew Lift Recommendations - Sakshi

ఆప్‌ సర్కార్‌ వర్సెస్‌ ఎల్జీ మరోసారి తెర మీదకు వచ్చింది. వీకెండ్‌ కర్ఫ్యూ ఎత్తేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఒక ప్రతిపాదనతో పాటు కొవిడ్‌ ఆంక్షల్ని సవరించాలన్న విజ్ఞప్తిని సైతం ఆయన తోసిపుచ్చారు.  

కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తేల్చేశారు. అయితే 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి మాత్రం ఎల్జీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఎల్జీ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే వారంగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని రీజియన్‌లో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్‌ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. 

అయితే న్యూఢిల్లీ ట్రేడర్స్‌ అసోషియేషన్‌, సదర్‌ బజార్‌ ట్రేడర్స్‌, ఇతర మార్కెట్‌ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతూ  ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే  ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది. 

ఇదిలా ఉంటే కర్ణాకటలో ఓపక్క వీకెండ్‌ కర్ఫ్యూ ఎత్తివేయగా..  తమిళనాడులో వీకెండ్‌లో పూర్తిగా లాక్‌డౌన్‌, మిగతా రోజుల్లో నైట్‌ కర్ఫ్యూ కొనసాగుందని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top