తెలంగాణ సీఎం ఎవరు?.. వెయిటింగ్‌!

Congress CLP Meeting Process At Hyderabad Updates - Sakshi

Live Updates

ఏఐసీసీ నిర్ణయం కోసం వెయిటింగ్‌

►సీఎల్పీ భేటీ అనంతరం.. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేపట్టిన డీకే శివకుమార్‌
►ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడిన డీకేఎస్‌
►ముగిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ
►ఎమ్మెల్యేల అభిప్రాయలను ఏఐసీసీకి పంపిన డీకేఎస్‌
►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక సమాచారం కోసం వెయిటింగ్‌
►కాంగ్రెస్‌ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ 

ముగిసిన సీఎల్పీ సమావేశం..

►మరో రెండు గంటల్లో సీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం

►తెలంగాణ‍ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం. 

►సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్న డీకే శివకుమార్‌. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో మాట్లాడుతున్న డీకే, దీపాదాస్‌ మున్షి. 

►సీఎల్పీ సమావేశం అనంతరం డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత ఎంపికను అధిష్టానానికి అప్పగించారు. సీఎల్పీ తీర్మానాన్ని రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఎల్పీ నిర్మానాన్ని భట్టి విక్రమార్క, తుమ్మల బలపరిచారు. తీర్మానాన్ని ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తున్నాం. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. 

►హోటల్‌ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపికపై పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేశారు. 

►ఏకవాఖ్య తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్‌ రెడ్డి.. తీర్మానాన్ని బలపరిచిన తుమ్మల నాగేశ్వర రావు

►సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్‌లో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరు.

►కాంగ్రెస్‌ సీఎల్పీ నేతల సమావేశం ప్రారంభమైంది. నగరంలోని హోటల్‌ ఎల్లాలో కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపిక, మంత్రులు ఎవరు? అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

►సీఎం పదవి కోసం ముగ్గురు సీనియర్‌ నేతల లాబీయింగ్‌. 

►ఢిల్లీ పెద్దలతో భట్టి విక్రమార్క్‌ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఏకాభిప్రాయం కుదుర్చుకునేందకు అధిష్టానం ప్రయత్నాలు. 

►సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. నా గెలుపు ములుగు ప్రజల విజయం, న్యాయం గెలిచింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాను. 

►మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజా పాలన కోసమే ‍కాంగ్రెస్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం. బీఆర్‌ఎస్‌ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. 

కేబినెట్‌లో ఎవరు?
►వివేక్‌ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్‌ రావు, వెడ్మ బోజ్జు, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, ఆది శ్రీనివాస్‌, రేవంత్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్‌, సీతక్క, కొండా సురేఖ, భట్టి విక్రమార్క్‌, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్‌, కూనంనేని సాంబశివరావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లేదా పద్మావతి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహ, సుదర్శన్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, మల్‌రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్‌, రామ్‌ మోహన్‌ రెడ్డి. 

సీఎం ఎంపిక అధిష్టానం నిర్ణయం: భట్టి విక్రమార్క
►అంతకుముందు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. సీఎల్పీ సమావేశంలో అందరి నిర్ణయం తీసుకుని పార్టీ అధిష్టానం సీఎంను ఎంపిక చేస్తుంది. నేను సీఎల్పీ నేతగా ఉన్నాను. పార్టీ అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేశాను. ఉచిత కరెంట్‌ అనగానే దేశంలో గుర్తుకు వచ్చేది వైఎస్సార్‌. ఎన్నికల ముందే చెప్పారు ఉచిత కరెంట్‌ ఇస్తానని.. చెప్పడమే కాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టారు. అది చేసి చూపించిన పేటెంట్‌ రైట్‌ కాంగ్రెస్‌ పార్టీదే. కాంగ్రెస్‌ అంటే కరెంట్‌.. కరెంట్‌ అంటే కాంగ్రెస్‌. కరెంట్‌ను ముట్టుకుంటే ఎలా మాడిపోతారో ఇప్పుడు ఫలితాలు చూశారు కదా.

70 స్థానాల్లో గెలవబోతున్నామని ముందే చెప్పాను. గెలిచి చూపించాం. మా అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ చూస్తే తెలుస్తుంది. ఎంత బలంగా జనం ప్రజా ప్రభుత్వం తెచ్చుకోవాలని సిద్ధమయ్యారో. ప్రజాస్వామితంగా పాలన ఉండాలని కోరుకున్నారు. దొరల తెలంగాణ కాదు.. ప్రజల తెలంగాణ గెలవాలని కోరుకున్నారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో ఆదిలాబాద్‌ అడవుల్లో ఎవరూ తిరగని ప్రాంతాల్లోకి వెళ్లాను.. అక్కడే పడుకున్నాను. సింగరేణి ప్రాంతాల్లో కూడా తిరిగాను. మా పార్టీ అధికారంలోకి రాగానే ఏమీ చేస్తామన్నది క్లారిటీ ఇచ్చాం. 

►పార్క్‌ హయత్‌లో డీకే శివకుమార్‌తో ఉత్తమ్‌, భట్టి, రాజగోపాల్‌ రెడ్డి భేటీ. సీఎల్పీ సమావేశం కంటే ముందే నేతల సమావేశంతో ఉత్కంఠ. ఈ సమావేశం తర్వాత హెటల్‌ ఎల్లాకు బయలుదేరనున్న నేతలు

►ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. 

►మరోవైపు.. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను రాజ్‌భవన్‌కు తీసుకువెళ్లేందుకు హెటల్‌ ఎల్లా వద్ద టీపీసీసీ బస్సులను సిద్ధం చేసింది. 

భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. 
►పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? 
►ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top