
లోకేష్ అసమర్థతను వెలుగులోకి తెచ్చిన అనిత
మంత్రిగారు.. అది కూడా హోం మంత్రి తన సొంత నియోజకవర్గంలో హాస్టల్ తనిఖీకి వచ్చారు.. మంత్రి వస్తున్నారంటే హాస్టల్ శుభ్రంగా ఉంచి ఆ ఒక్కరోజే అనే పిల్లలకు మంచి భోజనం పెట్టాలి కదా.. కార్యక్రమంలో పాయకరావుపేటలోని బీసీ బాలికల హాస్టల్ నిర్వాహకులు మంత్రి గారికి ప్రత్యేకంగా పురుగులతో చేసిన పులుసు వడ్డించారు.. ఇంకేముంది మంత్రి అనిత అవాక్కయ్యారు.. ఏంటి మంత్రిని నేను వస్తె పురుగుల భోజనం పెడతారా అని గదమాయించాడు. " ఏంజేస్తాం మేడం ఎలకల వేపుడు.. బల్లుల ఇగురు.. బొద్దింకల పచ్చడి పెడదాం అనుకున్నాం.. కానీ దొరకలేదు" అని సిబ్బంది లోలోన నవ్వుకున్నారు.
ఈ క్రమంలో మంత్రి అనిత.. ఉన్నఫలంగా అధికారుల మీద ఫైరయ్యారు.. ఏంటి భోజనం ఎలా ఉంటుందా.. మీ విద్యాశాఖ ఇలా పనిచేస్తుందా అంటూ మీడియా కవరేజ్ కోసం కొన్ని డైలాగులు కొట్టారు. అంతా బానే ఉంది కానీ ఆవిడ వెళ్లిన హాస్టల్.. చేసిన భోజనం అంతా డీ ఫ్యాక్టో సీఎం లోకేష్ పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కొన్ని క్షణాలు మర్చిపోయినట్లున్నారు. ఏంటి.. నాకు పెట్టే భోజనంలోనే పురుగుల అని అధికారులపై చిరాకు చూపిస్తూ.. మీడియాకు న్యూస్ అందించారు.. అది కాస్త బ్యాక్ ఫైర్ అయిందని అధికారులు తెలుగుదేశం పెద్దలు అంటున్నారు. పురుగులు వస్తే వచ్చాయి పక్కకు తీసి పడేసి భోజనం చేసి భళా భళా అంటే సరిపోయేది కదా..సాక్షాత్తు లోకేష్ శాఖలో తప్పులు పట్టుకుని అనవసరంగా నెత్తిమీదకు తెచ్చుకున్నారు మంత్రిగారు అని పార్టీ నేతలు..కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.
అమాయకత్వమో.. అత్యుత్సాహమో.. అజ్ఞానమో తెలియదు కానీ కూటమి క్యాబినెట్లో మంత్రులు ఒక్కోసారి ఇలాంటి హుషారు పనులు చేసి మీడియాకి న్యూస్ అయిపోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా మహిళలపై వరుస దాడులు జరుగుతున్న తరుణంలో హోం మంత్రి ఏం చేస్తున్నారు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేనే హోంశాఖ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.. అంటూ డైలాగులు పేల్చారు.. ఆ డైలాగులు ఆరోజు పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచాయి. కానీ ఆయన చేసిన కామెంట్లు హోం మంత్రి అనితతో బాటు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. క్యాబినెట్‌లో రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏకంగా హోం మంత్రి పనితీరును తప్పు పట్టడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
ఆ తర్వాత ఆయన తన తప్పును తెలుసుకొని సైలెంట్ అయ్యారు అది వేరే విషయం. ఆ తర్వాత కాశీనాయన క్షేత్రం లో భవనాలు కూల్చివేతకు సంబంధించి లోకేష్ అత్యుత్సాహంతో వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ శాఖ పరిధిలో ఉన్న భవనాలను లోకేష్ ఆదేశాల మేరకు కూల్చివేయడం పవన్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఆ తర్వాత ఆ అంశం సైలెంట్ అయింది. ఇప్పుడు అనిత కూడా నక్కపల్లి లో బాలికల హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడ పరిస్థితులను చూసి షాక్ అయ్యారు.
43 మంది ఆడ పిల్లలు చదువుతున్న హాస్టల్ వద్ద కనీసం సీసీ కెమెరాలు లేవు. వార్డెన్ పిల్లల్ని వదిలేసి 5 గంటలకే ఇంటికి వెళ్ళిపోయింది. సన్న బియ్యం ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదు. ముతక బియ్యంతో ఉడికే ఉడకని భోజనం పెడుతున్నారు. మెనూ అమలుకావడం లేదని విద్యార్థులు చెప్పడం గమనార్హం. అయితే విద్యార్థులతో కలిసి భోజనం చేద్దాం అని కూర్చున్న హోం మంత్రి అనితకు మొదటి ముద్దలోనే పురుగు వచ్చింది. అదేంటి నేను వచ్చిన రోజు కూడా ఇలాంటి భోజనమే పెట్టారు అంటే మిగతా రోజుల్లో ఇంకెలా ఉంటుందో అంటూ ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది.
ముఖ్యమంత్రి కొడుకు హోదాలో అన్ని శాఖల్లోనూ దూరీపోవడమే కాకుండా.. ఇటు హోంశాఖ తో పాటు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే బాధ్యత వారిని టార్చర్ చేసే వ్యవహారాలన్నీ చూస్తున్న లోకేష్ ఏకంగా విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేశారు. టీచర్ల బదిలీలు పాఠశాలల రేషన్లైజేషన్ ఇదంతా పెద్ద గందరగోళంగా మారింది. దీంతో ఆయన హాస్టల్లు విద్యార్థులు భోజనాలు వంటి చిన్న చిన్న అంశాలను పట్టించుకోవడమే మానేశారు. ఈ అంశం ఏకంగా హోం మంత్రి పర్యటనలోనే వెల్లడి కావడంతో ఆమె ఇది లోకేష్ బాబు శాఖ కదా కాస్త చూసి చూడనట్టు పోదాం అని సర్దుకోకుండా ఇంత దరిద్రంగా ఉంది ఏంటి అని ఓపెన్ గా కామెంట్ చేశారు. అంటే లోకేష్ తన శాఖను సరిగ్గా చూడటం లేదని ఆమె చెప్పకనే చెప్పేశారు. ఆమె కామెంట్ ఆమె పీకల మీదకు తెస్తుందా ఏమో అని కార్యకర్తలు లోలోన చెవుల కొరుక్కుంటున్నారు.
-సిమ్మాదిరప్పన్న