మమ్మల్ని ఎవరు గిల్లినా ఊరుకోం  | Sakshi
Sakshi News home page

మమ్మల్ని ఎవరు గిల్లినా ఊరుకోం 

Published Sun, Nov 26 2023 4:42 AM

UP CM Yogi in Hyderabad road shows - Sakshi

వేములవాడ/సాక్షి, ఆసిఫాబాద్‌/రాంగోపాల్‌పేట్‌/అబిడ్స్‌: ‘మమ్మల్ని ఎవరు గిల్లినా ఊరుకొనేది లేదు’అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో 2017కు ముందు యూపీలోనూ అలానే ఉండేవని... మాఫియా, గూండాగిరీ, దాదాగిరీ, కబ్జాలు కొనసాగేవని చెప్పారు. అయితే యూపీ ప్రజలు కుటుంబ పాలనకు తెరదించి బీజేపీకి పట్టం కట్టడంతో ఇప్పుడు అవన్నీ బంద్‌ అయ్యాయన్నారు.

ఇప్పుడు తమ రాష్ట్రంలో ఎవరైనా గూండాగిరీ, మాఫియా నడిపిస్తే బుల్డోజర్లతో బుద్ది చెబుతున్నామని పేర్కొన్నారు. బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో ఇప్పటివరకు తమ రాష్ట్రంలో ఒక్క రోజూ కర్ఫ్యూ పెట్టలేదని చెప్పారు. అలాగే అభివృద్ధి, ఆదాయంలోనూ యూపీ సర్‌ప్లస్‌లో కొనసాగుతోందన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లలో రామరాజ్య స్థాపన విజయ సంకల్ప సభలతోపాటు హైదరాబాద్‌లోని సనత్‌నగర్, గోషామహల్‌ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన రోడ్‌ షోలలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రసంగించారు. 

హైదరాబాద్‌ పేరు మారుస్తాం... 
యూపీలో ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని, మరో 4 లక్షలు కల్పించబోతున్నామని యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు కోసం బీజేపీని గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలా రక్షణ కల్పించి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా మార్చిందని... తాము అధికారంలోకి వస్తే చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ మాత పేరుపై హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్‌ చెట్టపట్టాలేసుకొని అభివృద్ధిని విస్మరిస్తున్నాయని... ఈ మూడు పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా మిగతా ఇద్దరికీ చెందుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్‌ బంధువులు మాత్రమే రాజ్యాధికారం చెలాయిస్తున్నారని దుయ్యబట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో ఏర్పడిన రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ ఆ డిమాండ్లేవీ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. 

అధికారికంగా ‘విమోచనం’..  
బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఆ ఫలాలను వెనకబడిన వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని యోగీ ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు. ఎంఐఎంకు భయపడే సీఎం కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. యూపీలో బీఎస్పీ ఒక్క సీటే గెలుచుకుందని... ఇక్కడ ఆ పార్టీని ప్రజలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే రామమందిరం కట్టించేదా? కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 

Advertisement
Advertisement