రెబల్స్‌పై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

రెబల్స్‌పై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఆగ్రహం

Published Sun, Mar 6 2022 10:24 AM

CM Stalin Gets Tough With Rebel DMK Councillors To Resign - Sakshi

‘‘పార్టీ నిర్ణయమే శిరోధార్యం కావాలి.. కాదు.. కూడదంటే వేటు తప్పదు. మిత్రపక్ష పార్టీలకు కేటాయించిన స్థానాల్లో డీఎంకే రెబల్స్‌ పోటీ చేయడం తగదు. వెంటనే పట్టణ పంచాయతీ అధ్యక్ష, మునిసిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులకు రాజీనామా చేసి నాతో భేటీ అవ్వండి లేకుంటే తగిన మూల్యం తప్పదు..’’ అని సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. 

సాక్షి, చెన్నై: డీఎంకే కూటమి కట్టుబాట్లను అతిక్రమించి, పార్టీ అదేశాలను ధిక్కరించి కొందరు నాయకులు పదవులు చేజిక్కించుకోవడాన్ని సహించేది లేదని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ హెచ్చరించారు. రెబల్స్‌ అంతా తమ పదవులకు వెంటనే రాజీనామా సమర్పించి ఆ తరువాత తనను కలవాలని హుకుం జారీ చేశారు. 

కూటమి నేతల నిరసన 
డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే,  సీపీఐ, సీపీఎం తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్పొరేషన్, మునిసిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల పదవులకు శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు డీఎంకే అధిష్టానం నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు ధిక్కరించారు. రెబల్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగి.. పదవులను కైవసం చేసుకున్నారు. మునిసిపాలిటీ  చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ పదవులకు సంబంధించి 16 స్థానాలను మిత్రపక్ష వీసీకేకు డీఎంకే కేటాయించింది.

అయితే ఏడు స్థానాల్లో డీఎంకే రెబల్స్‌ పోటీచేసి ఆ పదవులను దక్కించుకున్నారు. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక వీసీకే అధ్యక్షుడు తిరుమాంళవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ బహిరంగంగానే నిరసన తెలిపారు. కూటమి పా    ర్టీలకు కేటాయించిన పదవుల్లో డీఎంకే కౌన్సిలర్లు పోటీ చేసి పీఠం దక్కించుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడిన స్టాలిన్‌ చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ నేతలతో శుక్రవారం సాయంత్రం çసమావేశమయ్యారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి పదవులు పొందిన డీఎంకే కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకరిద్దరు ఈ ఆదేశాలకు తలొగ్గి రాజీనామా చేసినా.. అధికశాతం మంది ఆలోచనలో పడ్డారు. రాజీనామా చేయకుండానే స్టాలిన్‌ను కలిసి నచ్చజెప్పాలని, తప్పనిసరైన పక్షంలోనే రాజీనామా చేయాలని వారు భావిస్తున్నారు.  

చెన్నైలో కమిటీల ఎన్నికకు సన్నాహాలు      
చెన్నై మేయర్‌గా ఆర్‌. ప్రియ, డిప్యూటీ మేయర్‌గా మహేష్‌కుమార్‌ ఎన్నిక పూర్తయ్యింది. చెన్నై కార్పొరేషన్‌లోని 200 వార్డుల్లో 80 లక్షల మంది నివసిస్తున్నారు. వీరికి తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం తదితర ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు గాను 15 మండల కమిటీలు, ఆరు స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే వీటికి అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పదవులకు గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉండటంతో అన్ని కమిటీలనూ ఏకగ్రీవం చేయాలని డీఎంకే భావిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement