మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే.. మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్‌

Aug 7 2025 1:21 AM | Updated on Aug 7 2025 1:22 AM

CM Revanth Reddy Comments On PM Narendra Modi

బుధవారం ఢిల్లీలో జరిగిన బీసీ మహాధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ , పొన్నం ప్రభాకర్, మల్లు రవి

రాహుల్‌ గాందీని ప్రధానమంత్రిని చేసుకుంటాం

బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి తీరతాం.. ఢిల్లీ మహాధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజల శక్తిని, ఉద్యమ స్ఫూర్తిని ప్రధాని మోదీ 

తక్కువ అంచనా వేస్తే తడాఖా చూపిస్తాం 

ఇక ఢిల్లీకి రాము.. గల్లీలో బీజేపీ నేతలను పట్టుకుంటాం.. 

ఆ పార్టీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవు 

నాడు కేసీఆర్‌ చేసిన చట్టమే నేడు గుదిబండగా మారిందన్న సీఎం 

బీజేపీ నేతలు బీసీ కోటా పెంపునకు అడ్డుపడుతున్నారంటూ ఫైర్‌ 

ధర్నాకు గైర్హాజరైన ఖర్గే, రాహుల్‌గాంధీ  

సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే రాహుల్‌గాంధీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించుతామని హెచ్చరించారు. ఎర్ర కోటపై మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్‌ గాందీని ప్రధానమంత్రిని చేసుకుని బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌ను నెరవేర్చుకుంటామని చెప్పారు. 

తెలంగాణ ప్రజల శక్తిని, ఉద్యమ స్ఫూర్తిని మోదీ తక్కువగా అంచనా వేస్తే తడాఖా చూపిస్తామని అన్నారు. బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో టీపీసీసీ బుధవారం నిర్వహించిన మహాధర్నాలో సీఎం ప్రసంగించారు.  

సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తే అదే మరణ శాసనం 
‘గోధ్రా అల్లర్ల సమయంలో రాజీనామా చేయమని నాటి ప్రధానమంత్రి వాజ్‌పేయి నాడు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని కోరితే చేయలేదు. 75 ఏళ్లు నిండినందున ప్రధాని పదవి నుంచి వైదొలగాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ కోరుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. మోదీ లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఆయన భక్తుడు నిశికాంత్‌ దూబే అంటున్నారు. ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవు. 

బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయనను గద్దె దించడం ఖాయం. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీ రాము.. గల్లీకి వచ్చినప్పుడు బీజేపీ నేతలను పట్టుకుంటాం. ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాంధీ వారసునిగా వచ్చిన రాహుల్‌గాంధీ బీసీలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. సామాజిక న్యాయంపై రాహుల్‌గాంధీ శిలాశాసనానికి వ్యతిరేకంగా వస్తే అదే మరణ శాసనం అవుతుంది..’అని రేవంత్‌ హెచ్చరించారు.  

బీజేపీకి తెలంగాణ బీసీల అవసరం లేదా? 
‘బలహీన వర్గాలపై కక్ష గట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేశారు. నాడు కేసీఆర్‌ చేసిన చట్టమే నేడు రిజర్వేషన్ల పెంపునకు గుదిబండగా మారింది. తెలంగాణలో బలహీన వర్గాల బిడ్డలు.. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా అడ్డుగా ఉన్న చట్టాన్ని తొలగించాలని ఆర్డినెన్స్‌ చేసి గవర్నర్‌కు పంపినా ఆమోదించడం లేదు. 

కేసీఆర్‌తో పాటు బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావులు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ బీసీల అవసరం లేదా? బీఆర్‌ఎస్‌ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదు? తెలంగాణతో పేరు బంధంతో పాటు పేగు బంధం కూడా తెంచుకుందా?  

ఆ అదృష్టం నాకు దక్కింది 
‘దేశంలో వందేళ్ల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయలేదు. ఇప్పటివరకు దేశంలో 300 మంది ముఖ్యమంత్రులైనా ఎవరూ చేయని పనిని చేసే అదృష్టం నాకు దక్కింది. బీసీల రిజర్వేషన్లు పెంచే అవకాశం నాకు వచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకే ఢిల్లీలో ధర్నాకు దిగాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధించి తీరతాం..’అని ముఖ్యమంత్రి అన్నారు.  

కేటీఆర్‌ బుద్ధి మారలేదు.. అహంకారం తగ్గలేదు
బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్‌ డ్రామా అంటున్నారు. కానీ కేటీఆర్‌ పేరే డ్రామారావు. కేసీఆర్‌ కుటుంబం డ్రామాలతో బతుకుతోంది. అధికారం, పదవులు పోయినా కేటీఆర్‌ బుద్ధి మారలేదు..అహంకారం తగ్గలేదు. ఆ కుటుంబంలోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలం.. మరొకరు ప్రతికూలం.. మరొకరు అటూఇటూ కాకుండా మాట్లాడుతున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement