మేం సిద్ధం.. మీరు సిద్ధమా? | CM Revanth Reddy challenges BRS and BJP | Sakshi
Sakshi News home page

మేం సిద్ధం.. మీరు సిద్ధమా?

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

CM Revanth Reddy challenges BRS and BJP

హ్యామ్‌ రోడ్లకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్రజలకు ఎవరేం చేశారో తేల్చుకుందాం 

బీఆర్‌ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దాం 

మా పాలన, బీఆర్‌ఎస్‌ పాలన,దేశంలో బీజేపీ పాలనపై చర్చిద్దాం 

మేం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు 

ఎన్ని నాటకాలు వేసినా ప్రజలు నమ్మరు.. 2034 వరకు అధికారంలో ఉంటాం.. 

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం 

ప్రజలు తమకు అండగా నిలవాలన్న సీఎం

నల్లగొండ జిల్లా కనగల్‌ మండల కేంద్రంలో రాష్ట్రవ్యాప్త హ్యామ్‌ రోడ్లకు శంకుస్థాపన

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలన, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, దేశంలో 12 ఏళ్ల బీజేపీ పాలన, మేనిఫెస్టోలపై చర్చించేందుకు తాము సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమం, ఆత్మ బలిదానాలపై కూడా చర్చిద్దామని, ప్రజలకు ఎవరేం చేశారో తేల్చుకుందామని అన్నారు. ‘మీరు స్పీకర్‌కు లేఖ రాయండి.. అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దాం. ఎన్ని రోజులైనా చర్చిద్దాం.. ఇందుకు మీరు సిద్ధమా..’ అని సవాల్‌ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.13 వేల కోట్లతో నిర్మించనున్న హ్యామ్‌ రోడ్లకు నల్లగొండ జిల్లా కనగల్‌ మండల కేంద్రంలో ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అక్కడి వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన హ్యామ్‌ రోడ్ల పైలాన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నల్లగొండ పట్టణంలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.  

2034 వరకు మాదే అధికారం.. 
‘మా ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్‌కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. కాంగ్రెస్‌ రెండున్నరేళ్లలో ఏమీ చేయలేదని బీజేపీ, బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్‌ శుక్రాచార్యుడిలా ఫామ్‌హౌస్‌లో ఉంటే కేటీఆర్, హరీశ్‌లు బిల్లారంగా తరహాలో తెలంగాణలో తిరుగుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం పోవాలని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ప్రజలు అలా ఏమీ కోరుకోవడం లేదు. వారి కుటుంబం, వారికి సంబంధించిన వారే కోరుకుంటున్నారు. సింగరేణిలో టెండర్‌ ప్రక్రియ పూర్తి కాకముందే ఆరోపణలు చేశారు. వారు ఎన్ని నాటకాలు వేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. వారు సామాజికంగా బీఆర్‌ఎస్‌ను బహిష్కరించారు. 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం. పదేళ్లు వెనక్కు తిరగకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం. మాకు ప్రజలు అండగా ఉండాలి..’ అని సీఎం కోరారు.  

కొండా లక్ష్మణ్‌ బాపూజీ, కోమటిరెడ్డి త్యాగాలను ఏమనాలి? 
‘బీఆర్‌ఎస్‌ త్యాగాల పునాదులపై తెలంగాణ వచ్చిందన్నారు. మీవి త్యాగాలా? ఆ పేరుతో రాజీనామాలు చేసి ఎన్నికలు తెచ్చి కలెక్షన్లు చేశారు. మీరు చేసినవే త్యాగాలంటే.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన త్యాగాలను ఏమనాలి? 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ మంత్రి పదవి తీసుకోలేదు. మలి దశ ఉద్యమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవి వదిలేసి, నల్లగొండ గడ్డపై తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తెలంగాణ వచ్చాకే పదవి తీసుకుంటానని ప్రతినబూని వచ్చాకే మళ్లీ మంత్రి పదవి తీసుకున్నారు. రూ.100 పెట్రోలు తెచ్చుకుని 1 రూపాయి అగ్గిపెట్టె తెచ్చుకోలేని హరీశ్‌రావుది త్యాగమా? శ్రీకాంతచారి, కానిస్టేబుల్‌ కిష్టయ్య, యాదయ్యలది త్యాగమా? అగ్గిపెట్టె హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు తెలంగాణ అప్పులు రూ.69 వేల కోట్లు ఉంటే బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.8.11 లక్షల కోట్లకు పెంచారు. అలాంటి వారి దోపిడీని ప్రజలు ఇంకా సహించాలా? పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించిన మిమ్మల్ని ఏమనాలి?..’ అని రేవంత్‌ ప్రశ్నించారు.  

ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కడుపు మంట ఎందుకు? 
‘రూ.16 వేల కోట్లు పెట్టి పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం. ఫామ్‌ హౌస్‌లో ఉండే కేసీఆర్‌ ఏం తింటున్నారో, తండాలో ఉండే గిరిజన బిడ్డలు కూడా ఆ సన్న బియ్యమే తింటున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలకు డౌటు ఉంటే తండాలు, గూడేలకు వెళ్లి సన్న బియ్యం తింటున్నారో? లేదో? చూసి రావాలి. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. మేము రెండున్నరేళ్లలో 4.5 లక్షల ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలకు కడుపు మండుతోంది. పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న వారికి కడుపుమంట ఎందుకు? తండ్రి, కొడుకు, అల్లుడికి ఫామ్‌ హౌస్‌లు, పదవులు తప్ప ప్రజల గురించి ఆలోచనే లేదు. పరీక్షలు పెట్టి పేపర్లు అమ్ముకుని వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు..’ అని సీఎం దుయ్యబట్టారు.   

వందలాది అంబేడ్కర్‌లు తయారు కావాలి 
‘మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. యంగ్‌ ఇండియా స్కూల్స్, స్కిల్స్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పేద బిడ్డ పెద్ద చదువులు చదవాలి. వందల మంది అంబేడ్కర్‌లు తయారు కావాలి.  

అడ్డు పడితే మూసీలో వేసి తొక్కుతా.. 
మూసీ ప్రక్షాళన చేసి తీరుతా. ఎవరు అడ్డు పడినా మూసీలో వేసి తొక్కుతా. మోదీ సబర్మతే కాదు..ఢిల్లీ యమునా కాదు.. యోగి గంగా నది కాదు.. దేశానికి ఎవరొచ్చినా మూసీ ప్రక్షాళన చూడటానికే రావాలనేలా, దేశానికే తలమానికంగా ఉండేలా మూసీని ప్రక్షాళన చేస్తా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి కృష్ణా జలాలను నల్లగొండ గడ్డపై పారించి రైతులకు సాగునీరు అందిస్తా. డిండి ఎత్తిపోతలను కూడా పూర్తి చేస్తా..’ అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.    

చరిత్రలో మొదటిసారిగా..: భట్టి 
దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా రూ.23 వేల కోట్లతో రోడ్ల పథకాన్ని ప్రారంభించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా రూ. 90 వేల కోట్లతో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించడం ద్వారా తెలంగాణ భవిష్యత్‌కు అద్భుతమైన పునాదులు వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అహంకారంతో ప్రజలను హింసించిందని, తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రజల అవసరాలను తీర్చే కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు.   

మొదటి వరుసలో నల్లగొండ 
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోళ్లలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే, రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మొదటి వరుసలో ఉందన్నారు. ఒక్క యాసంగి సీజన్‌లోనే 81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ.19,013 కోట్లు వేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో  రూ.79,886 కోట్లు వేశామని తెలిపారు. 

ఏపీలో రూ.3 వేల కోట్లు..ఇక్కడ రూ.26 వేల కోట్లు 
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో రూ.3 వేల కోట్లతో రోడ్డు పనులు చేస్తుంటే రాష్ట్రంలో రూ.6 వేల కోట్లతో చేస్తున్నామని చెప్పారు. దానికి అదనంగా రూ.13 వేల కోట్లతో హ్యామ్‌ రోడ్లు, పంచాయతీరాజ్‌ శాఖ నుంచి రూ.7 వేల కోట్లతో హ్యామ్‌ రోడ్లు, శాఖాపరంగా అన్నీ కలిపి రూ.26 కోట్లతో రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ డి్రస్టిబ్యూటరీ పనులతో పాటు గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు, దాన్ని వెంటే బుల్లెట్‌ ట్రెయిన్‌ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని, అవీ కలిపితే రోడ్ల పనులు దాదాపు రూ. 80 వేల కోట్లకు చేరతాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నేతలు.. టెండర్లు ఓపెన్‌ చేయకుండానే స్కామ్‌లు జరిగాయని ఆరోపించడం దురదృష్టకరమన్నారు. ‘ఇప్పుడు టెండర్లు తెరిచాం. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాయి. గతంలో మీరు చేసినప్పటి రేట్లు ఇప్పటి రేట్లు చూసుకోవాలి’ అని ఆయన హితవు పలికారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement