ఈటల భూముల కోసమే రూ. 27 కోట్లు ఇచ్చా  | Chennuru Congress candidate Vivek in the election campaign | Sakshi
Sakshi News home page

ఈటల భూముల కోసమే రూ. 27 కోట్లు ఇచ్చా 

Published Fri, Nov 24 2023 3:52 AM | Last Updated on Fri, Nov 24 2023 3:52 AM

Chennuru Congress candidate Vivek in the election campaign - Sakshi

భీమారం: బీజేపీ నేత ఈటల రాజేందర్‌ భూముల కోసమే రూ. 27 కోట్లు చెక్కుల రూపంలో ఇచ్చానని, ఆ భూముల వ్యవహారంలో తనకు నోటీసులు ఇచ్చిన ఐటీ అధికారులు... ఆయనకు ఎందుకు ఇవ్వలేదని చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ ప్రశ్నించారు. బీజేపీలో ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈటలకు నోటీసులు కూడా ఇవ్వడం లేదా అని నిలదీశారు.

గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేక్‌... బీఆర్‌ఎస్‌తోపాటు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో ఉన్నప్పుడు తనను సీతలా చూసిన ఆ పార్టీ నేతలు... కాంగ్రెస్‌లో చేరాక రావణుడిలా చూస్తున్నారన్నారు.

చెన్నూరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు చెప్పి తనపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో హుజూరాబాద్, మునుగోడులో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశానని చెప్పారు. బాల్క సుమన్‌ ఫిర్యాదుతో ఐటీ అధికారులు 8 చోట్ల సోదాలు నిర్వహించి దాదాపు 12 గంటలపాటు తాను ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారని వివేక్‌ ఆరోపించారు. 

ఆ కంపెనీ నా మిత్రుడిదే... 
తాను నిజాయతీతో వ్యాపారం చేస్తున్నానని, ఇప్పటివరకు రూ. 10 వేల కోట్ల మేర పన్నులు చెల్లించా నని వివేక్‌ వివరించారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆర్థిక సాయం చేశానని, అలాంటిది తనపై దాడులు చేయించారన్నారు. కేసీ ఆర్‌కు దమ్ముంటే ఈ ఎన్నికల్లో గెలవాలని సవాల్‌ విసిరారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలసి తనను అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నా యని వివేక్‌ ఆరోపించారు.

రూ. 20 లక్షల కంపెనీ రూ. 200 కోట్ల మేర లావాదేవీలు చేసిందని అంటున్నారని, కానీ ఆ కంపెనీ తన మిత్రుడికి చెందినదని వివేక్‌ తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారమే తాను ఆ కంపెనీని చూసుకుంటున్నానని చెప్పారు. ఇటీవలే ఆ కంపెనీ షేర్లు అమ్మితే రూ. 50 కోట్ల లాభం వచ్చిందని, అందులో రూ. 9 కోట్లను పన్నుగా చెల్లించామని వివేక్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement