సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అండే స్టాండ్ అనే విధంగా సిట్ వ్యవహరిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదా? అని ప్రశ్నించారు. అడిగిందే అడిగి.. టైం పాస్ చేయడం తప్ప దీంట్లో మరేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అండే స్టాండ్. పాలన చేతగాక అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఫోనట్ ట్యాపింగ్ కేసు కార్తీక దీపం సీరియల్ మాదిరిగా నడుస్తోంది. కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసింది. ఇది మాత్రం అవ్వట్లేదు. టీవీ సీరియల్ డ్రామాలను తలపించేలా డ్రామాలు చేస్తున్నారు. కేసు విచారణ ప్రారంభించి రెండేళ్లు అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బలి అయ్యేది పోలీసు అధికారులే అని చెప్పుకొచ్చారు.
ఇది ట్రాష్ కేసు.. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. హరీష్ రావును అడిగిందే అడిగి టైమ్ పాస్ చేశారు. రేపు నాతో కూడా అదే చేస్తారు. నా ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో సిట్‌ను అడుగుతాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం లేదు?. గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న శివధర్ రెడ్డిని విచారణకు పిలిచారా?. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని చెబుతున్నారు. సిట్ వేయాల్సింది ఎవరి మీదనో తెలుసా.. గూండాలతో భూములు కబ్జా చేస్తున్న మంత్రి పొంగులేటి కొడుకుపై సిట్ వేయాలి. బొగ్గు కుంభకోణంలో రేవంత్ రెడ్డి బావమరిదిపై సిట్ వేయాలి. కంచె గచ్చిబౌలి భూముల్లో స్కామ్ జరిగింది. సిట్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు సిట్ వేయలేదన్నారు.
హరీష్ రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టారు. సాయంత్రం కల్లా సిట్ నోటీసులు అందాయి. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అనేది నేడు జరుగుతోంది ఏం కాదు.. 1952 నుంచి ఇప్పటి వరకూ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా అదే ట్వీట్ చేస్తాడు. ఆయనకేం తెలుసో, లేదో నాకైతే తెలియదు. సిట్ విచారణకు బరాబర్ వెళ్తాను. అన్ని సమాధానాలు చెబుతాను అని అన్నారు.
అలాగే, పరాభవం తప్పదనే భయంతో జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రజల సౌలభ్యం కోసమే మేము జిల్లాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ ఏర్పాటు చేసిన కొన్ని జిల్లాలను రద్దు చేయాలని చూస్తున్నారు. కొత్త జిల్లాల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి సులభతరం అవుతుందని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలని చూస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచాయతీ ఫలితాలు మించి మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం సంపాదిస్తుంది. జిల్లాల ఏర్పాటుపైన కమిషన్ వేస్తున్నామంటున్నారు. కొత్త జిల్లాలైన సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలను రద్దు చేయాలనే యోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయమంటూ తుగ్లక్ పనులు చేస్తే ప్రజల చేత తిరస్కరించబడతారు. అధికార వికేంద్రీకరణ కొరకు కేసీఆర్ అడుగేస్తే మీరు చెరిపేయాలనుకుంటే ఉద్యమిస్తాం అని హెచ్చరించారు.


