నాటి పాపాలే.. నేటి శాపాలు!

Chandrababu Review On Defeat In Kuppam - Sakshi

కుప్పంలో ఓటమిపై చంద్రబాబు సమీక్ష

వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గుతున్న బీసీలు

సంక్షేమ పాలనకే ఓటేసిన ప్రజలు 

కుప్పం కోట బద్దలవడంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడిపోయారు. మూడున్నర దశాబ్దాల మోసానికి ప్రజలు తెరదించడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. సొంత నియోజకవర్గంలోనే ఘోర పరాభవం ఎదురుకావడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. కోలుకుంటామనే ఆశలు సన్నగిల్లినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రజావిజయానికి వక్రభాష్యం చెబుతున్నారు. తప్పు తనవైపు ఉంచుకుని పక్కవారిపై నెపం నెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి:  పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో అంతర్మథనం మొదలైంది. కుప్పంలో సైతం దారుణంగా ఓడిపోవడంపై నిరాశ వ్యక్తమవుతోంది. చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో శ్రేణుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల కంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని తెలియజేసినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా టీడీపీ  ఒక్క స్థానానికే పరిమితమైంది. స్థానిక ఎన్నికల్లో అయినా పుంజుకుంటామనుకుంటే కుప్పంలోనే ఘోర పరాభవం ఎదురైంది.

ఇన్నాళ్లు బలంగా ఉన్నామనుకున్న నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగలడంతో తమ్ముళ్లు దిగాలు చెందుతున్నారు. అధినేత చంద్రబాబు వాస్తవ పరిస్థితిని ఎంత వక్రీకరించినా పూర్వవైభవం వచ్చే అవకాశమే లేదని తేల్చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పుట్టి ముంచాయని వెల్లడిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా పార్టీని నాశనం చేశారని మండిపడుతున్నారు. నాటి మాటల పాలనకు.. నేటి చేతల పాలనకు ప్రజలు బేరీజు వేసుకునే ఓట్లేశారని తెలియజేస్తున్నారు.

సంక్షేమమే సగం బలం! 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనే ఆ పార్టీ మద్దతుదారులకు సగం బలమని కుప్పం వాసులు అంటున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు దక్కాలంటే జన్మభూమి కమిటీల సిఫార్సులు తప్పనిసరని, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, వలంటీర్లతో నేరుగా ఇంటికే వస్తున్నాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందిన సంక్షేమ ఫలాలే ప్రస్తుత ఎన్నికల ఫలితాలకు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

34,886 సామాజిక పింఛన్లు, 10,596 మందికి వైఎస్సార్‌ చేయూత, 10,418 మందికి ఇంటి పట్టాలు, 42,063 మందికి రైతుభరోసా,  26,903 మందికి అమ్మఒడి ద్వారా లబ్ధి చేకూరిందని వివరిస్తున్నారు. దీనికితోడు చంద్రబాబు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం కూడా టీడీపీకి నష్టం చేసిందని చెబుతున్నారు. పాలనను పీఏకి అప్పగించి ప్రజలను అష్టకష్టాలు పెట్టారని తెలియజేస్తున్నారు. అలాగే చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ నేత భరత్‌ అనుక్షణం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంతో మార్పుకు కారణమైందని విశ్లేషిస్తున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు మోసపూరిత వైఖరి కారణంగానే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి కనీసం ఏజెంట్లు కూడా లేని దుస్థితి దాపురించిందని వెల్లడిస్తున్నారు. 

చేసిందేమీ లేదు!
దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా చంద్రబాబు చేసిందేమీ లేదని స్థానికులు చెబుతున్నారు. వలసలను అరికట్టి బతుకుదెరువు చూపించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇజ్రాయిల్‌ టెక్నాలజీ అంటూ మభ్యపెట్టడమే కానీ అభివృద్ధి చేయలేదని పెదవి విరుస్తున్నారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ లబ్ధి పొందారే తప్ప వెనుకబడిన వర్గాల సంక్షేమం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కుప్పంలో 78శాతం ఉన్న బీసీలు ఏకమై చంద్రబాబుకు గుణపాఠం చెప్పారని వెల్లడిస్తున్నారు.
చదవండి: చంద్రబాబుకు భారీ షాక్‌: కుప్పంలో టీడీపీ ఢమాల్‌ 
విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top