టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటు తగదు 

BJP Leader Somu Veerraju Comments On Establishment of Tippu Sultan statue - Sakshi

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ ధర్నా 

సోము వీర్రాజు, నేతల అరెస్టు  

ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణంలో టిప్పుసుల్తాన్‌ విగ్రహం ఏర్పాటు చేయాలనే మునిసిపాలిటీ తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్‌ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ధర్నా అనంతరం సోమువీర్రాజు విలేకరులతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హిందూ మతానికి వ్యతిరేకంగా, ముస్లిం, క్రైస్తవ మతాలకు అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పాలనను ముందుకు సాగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. తిరుపతి నుంచి రూ. 5 వేల కోట్లు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం దారుణమని అన్నారు. కలెక్టర్‌ అనుమతి లేకుండా విగ్రహాన్ని ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. విగ్రహం ఏర్పాటు కోసం చేసిన శంకుస్థాపనను, మున్సిపల్‌ తీర్మానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.  

బీజేపీ నేతల అరెస్టు.. 
ధర్నా అనంతరం మున్సిపల్‌ కార్యాలయం నుంచి మైదుకూరు రోడ్డు వరకు ర్యాలీగా వెళ్లేందుకు సోమువీర్రాజు, బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. శంకుస్థాపన చేసిన స్థలం వద్దకు వెళ్తే శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతాయని ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు బీజేపీ నాయకులకు తెలిపారు. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినా వారు వినిపించుకోలేదు. ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఒకానొక దశలో బీజేపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బీజేపీ నేతలందరినీ పోలీసులు అరెస్టు చేశారు. సోమువీర్రాజును కడపకు తరలించగా ఇతర నేతలను ఎర్రగుంట్ల, చాపాడు, మైదుకూరు పోలీస్‌స్టేషన్‌లకు తీసుకెళ్లారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, రాష్ట్ర కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top