అమ్మ మీద ఆన.. కార్పొరేటర్ల ప్రమాణం

BJP Corporates Promise On Charminar Bhagyalaxmi Temple - Sakshi

భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రమాణం

సాక్షి, హైదరాబాద్ : ‘అమ్మవారి ఆశీర్వాదంతో గెలుపొందాం. అమ్మ మీద ఆన.. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండి, నీతి, నిజాయితీగా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాం. బీజేపీ సిద్ధాంతాలకు, జాతీయ సమగ్రతకు కట్టుబడి ఉంటాం’అని ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన 48 మంది బీజేపీ కార్పొరేటర్లు శుక్రవారం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణం చేశారు. తమతోనే పాతబస్తీ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్, సహా పలువురు ముఖ్య నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. దేశం కోసం, భాగ్యనగర అభివృద్ధి కోసం పాటుపడుతామని వారంతా ప్రకటించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు.

పొర్లు దండాలు పెట్టినా జైలు ఖాయం...
‘సీఎం కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలు, చేతగానితనం, మూర్ఖత్వం వల్ల పాతబస్తీ నేడు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. పాతబస్తీ మాది. పేదలు ఎక్కువగా నివసించే ఈ బస్తీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. భాగ్యలక్ష్మి అమ్మవారి వల్లే నగరానికి భాగ్యనగరం అనే పేరొచ్చింది. మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకోలేక పోయినా.. అమ్మ ఆశీర్వాదంతో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించింది. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్, ఆయన కుటుంబం భారీ అవినీతికి పాల్పడింది. కేంద్రం అన్ని లెక్కలూ తీస్తోంది. ఢిల్లీకి వెళ్లి ఎన్ని పొర్లుదండాలు పెట్టినా.. ఆయన జైలుకెళ్లడం ఖాయం’ అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మత ఘర్షణలు జరుగుతాయని టీఆర్‌ఎస్, ఎంఐఎం విషప్రచారం చేస్తున్నామని బండి సంజయ్‌ మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top