సాక్షి, తిరుపతి: టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం జరిగిందని, నాలుగు నెలలుగా ఒక్క రోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళారులు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్ రూ.15 వేలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.
దీన్ని నెలన్నర క్రితమే తాము బయటపెట్టినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆక్షేపించారు. పదే పదే తాము ప్రశ్నిస్తుంటే చివరికి ఏఐ, ఆటో ఫిల్లింగ్ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. శ్రీవాణి టికెట్ల స్కాంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూమన ఇంకా ఏం మాట్లాడారంటే..:
నిరంతరాయంగా శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ దోపిడీ:
శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ దోపిడీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఉదయం 9 గం,కు మొత్తం 800 శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో ఓపెన్ చేస్తే కేవలం ఒకటిన్నర నిమిషంలో మొత్తం టికెట్లు అమ్ముడు పోయినట్లు వస్తోంది. ఇదెలా సాధ్యం! దీని వెనుక మతలబు ఉంది. పెద్ద అవినీతి దాగి ఉంది. ఇంకా కుట్ర కూడా ఉందని మేం చెబుతున్నాం. దీని మీద టీటీడీ ఓ ప్రకటన ఇచ్చింది. ఇందులో సాఫ్ట్‌వేర్ మీద నిరంతర నిఘా పెట్టామని, ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ లాంటి పద్దతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లు పొందే అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశామని చెబుతోంది. అలాగే అక్రమ పద్దతుల్లో బుక్ చేస్తున్న ఐడీల్ని నిరోధించి దళారుల ఎత్తుగడల్ని తిప్పికొట్టేలా ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నట్లు చెబుతోంది. కాబట్టి మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరుతోంది.
టీటీడీ ద్వంద్వ వైఖరి:
ఇంకా 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించామని, బుకింగ్ సైట్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ చొరబడటం సాధ్యం కాదంటున్నారు. మరోవైపు మళ్లీ కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల్లో టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
నాలుగు నెలలుగా రోజుకు 8 టికెట్లూ ఇవ్వలేదు!:
టీటీడీని నేను ఓ ప్రశ్న వేస్తున్నా. 2024లో అధికారంలోకి వచ్చాక శ్రీవాణి టికెట్ల విధానాన్ని అత్యంత పటిష్టం చేశామని చెబుతున్న మీరు.. ఆటో ఫిల్లింగ్ పద్దతుల ద్వారా దళారులు చొరబడుతున్నారని ఒప్పుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 9న ఆన్ లైన్ విధానం ప్రవేశపెడితే, అప్పటి నుంచి ఇవాళ్టి వరకూ ప్రతీ రోజూ ఇచ్చే 800 శ్రీవాణి టికెట్లలో ఒక్కటి కూడా అర్హులకు అందలేదు. నాలుగు నెలలుగా ఈ విషయం మీరు గుర్తించనే లేదా? లేక నిద్రపోయారా? లేక నిద్ర నటిస్తున్నారా? లేదా మా విమర్శలకు భయపడి ఈ వివరణ ఇచ్చారా? అనేది చెప్పాలి.

దళారులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్‌లైన్‌లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల చేతుల్లో టికెట్లు కనిపిస్తున్నాయి. దీనిపై మేం లోతైన పరిశీలన చేస్తే టీటీడీ ఐటీ జీఎంగా ఓ ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ అర్హత కూడా లేని వ్యక్తిని నియమించారని తేలింది. ఈ వ్యక్తిని గతంలో విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరపమని పంపిస్తే దాదాపు రూ.30 లక్షలు తినేశాడని పట్టుకుని ఆ మొత్తం రికవరీ కూడా చేశాం. అలాంటి వ్యక్తిని జీఎంగా నియమించారు. పెద్దలు తమకు తాబేదారుగా ఉంటాడని అతన్ని ఈ పోస్టులో నియమించారు.
నిజానికి టీసీఎస్ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చాకే ఈ దోపిడీ మొదలైంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అతనికి అనుంగు శిష్యుడైన మరో బోర్డు సభ్యుడు, స్ధానికుడు కూడా అయిన వ్యక్తి కలిసి రోజుకు రూ.40 లక్షల ఆదాయం శ్రీవాణి టికెట్ల ద్వారా పంచుకుంటున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో దాదాపు రూ.48 కోట్లు అలా దండుకున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి చెందాల్సిన రూ.48 కోట్లను వీరు అక్రమంగా దోచుకున్నారు.
సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్ల జారీ!:
మేం కొత్త సాఫ్ట్ వేర్ తెచ్చినప్పుడు శ్రీవాణి టికెట్లను మూడు నెలలకోసారి సెక్యూరిటీ ఆడిట్ చేసి కేటాయించే వాళ్లం. కానీ ఇప్పుడు టీసీఎస్ ఎలాంటి సెక్యూరిటీ ఆడిట్ లేకుండానే రోజుకు 800 టికెట్లను రిలీజ్ చేస్తోంది. ఆటో ఫిల్లింగ్ ద్వారా ఎవరో దళారులు, ట్రావెల్ ఏజెంట్లు దూరుతున్నారని చెప్తున్న టీటీడీ.. మేం తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్ సిస్టమ్ లో మూడు నెలలకోసారి ఇచ్చే రూ.300 ఎస్‌ఈడీ టికెట్ల ఫ్రీ బుకింగ్ కానీ, కళ్యాణోత్సవం టికెట్లు కానీ, సేవా టికెట్ల డిప్‌లు కానీ, వసతి టికెట్లు కానీ, మూడు నెలలకు ఇచ్చే శ్రీవాణి కోటాలో ఎందుకు ఆటోఫిల్లింగ్ జరగడం లేదో సమాధానం చెప్పాలి. కొత్తగా ఆ సాఫ్ట్‌వేర్ రూపొందించామని చెప్తున్న టీటీడీ.. ఈ 800 టికెట్లకే ఎందుకు ఆటోఫిల్లింగ్ జరుగుతోందో చెప్పాలి.
అంటే అందరూ కూడబలుక్కుని దోపిడీ చేస్తున్నారు. విజిలెన్స్, ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం కావడమే కాకుండా నిస్సత్తువతో మిలాఖత్ అయ్యాయి. అటు పెద్దలు, ఇటు దళారులు, ఐటీ, విజిలెన్స్ కలిసే ఈ తతంగం నడుపుతున్నారు. ఒక్క రోజులో కనుక్కోవాల్సిన విషయాన్ని మేం పదే పదే చెప్తుంటే, విమర్శల జడివాన పెరిగాక ఇలా జరుగుతోందని, డేగ కన్ను వేశామని కబుర్లు చెప్తున్నారు. కన్ను తెరిచారే తప్ప అది పని చేయడం లేదు.
సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే:
శ్రీవాణి టికెట్ల స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఏకంగా రూ.48 కోట్ల స్కామ్ జరిగింది. మేం శ్రీవాణి టికెట్లు ఆ‹ లైన్‌లో ఇచ్చినప్పుడు రోజుకు 1000 వరకు ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వం దాన్ని మూసేసి ఆన్ లైన్ విధానం తీసుకొచ్చింది. ఈ నాలుగు నెలల కాలంలో రోజుకు కనీసం 8 మందికి కూడా టికెట్లు దొరకలేదు. దళారులంతా టీటీడీ వెబ్ సైట్ ద్వారానే టికెట్లు కొంటున్నారు. ఎలా అంటే మీ ఐటీ, విజిలెన్స్ విభాగాలు, పాలక మండలి పెద్దలు కుమ్ముక్కు కావడం వల్లే. అలా అంతా ఒక్కౖటై ఒక్కో బ్రేక్ దర్శనం టికెట్ రూ.4 వేలకు అమ్ముతున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు.


