ఆర్టీసీ విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. దొందూ దొందే | Bandi Sanjay Reacts Driver Shankar Goud Death Slams BRS Congress | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. దొందూ దొందే

Apr 24 2026 11:08 AM | Updated on Apr 24 2026 12:44 PM

Bandi Sanjay Reacts Driver Shankar Goud Death Slams BRS Congress

సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్‌ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అన్యాయమే చేశాయని విమర్శించారాయన. కార్మికుల కోసమే శంకర్‌ బలిదానం అయ్యాడని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని బండి సంజయ్‌ మండిపడ్డారు. 

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వలన  నర్సంపేటకి అర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కార్మికుల కొసం‌ శంకర్ గౌడ్ బలిదానం అయ్యాడు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం హత్యనే. కాంగ్రెస్‌ ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరికాదు. 

ఆర్టీసీలో 39 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. రిటైర్డ్‌ కార్మికులకు వచ్చే ఫించన్‌ కూడా చాలా తక్కువ. బీఆర్‌ఎస్‌ హయాంలో కార్మికులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించారు. ఆ సమ్మెలో 20 మంది చనిపోయారు. అయినా బీఆర్‌ఎస్‌ కనికరించలేదు. కార్మికులు 52 రోజులపాటు సమ్మె చేశారు. ఆ సమయంలో కార్మికుల కోసం పోరాడి మేం జైలుకు వెళ్లాం. మా పోరాటం ఫలితంగానే బీఆర్‌ఎస్‌ దిగి వచ్చింది.  

కాంగ్రెస్‌ది అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఆర్టీసీ పునరుద్ధరణకు సహకరిస్తామని చెప్పింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీని నెరవేరుస్తామని చెప్పింది. కానీ, 900 రోజులు అవుతున్నా ఆ డిమాండ్లు నెరవేరలేదు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవాళ  కార్మికులు అడుగుతున్నారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం వ్యవహారిస్తోంది. 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ..  కేంద్రాన్ని అడిగి మీ మేనిఫెస్టో రూపకల్పన చేశారా? బీఅర్ఎస్  పార్టీ మోసం చేసిందనే కదా మీకు ఓటు వేసింది. అలాంటప్పుడు కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు?. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యని పరిష్కారించాలి. మంత్రుల యాభై శాతం జీతం కోత వలన ఏం ప్రయోజనం?. డిల్లీ, తమిళనాడు, కేరళ,అస్సాం రాష్ట్రాలకి తెలంగాణ నుండే డబ్బులు పోతున్నాయి. మంత్రులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల్లో సగం అమ్మినా కార్మికుల బాధలు పొతాయి అని విమర్శలు గుప్పించారాయన. 

ఆర్టీసీ కార్మికుల దీక్షకి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉందన్న బండి సంజయ్‌.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా లైసెన్స్, శిక్షణ లేనివారిని తాత్కాలిక ఉద్యోగాలు‌ ఇవ్వడం ఏంటని నిలదీశారు. అలాగే తొందరపడవద్దని.. కలిసి కొట్లాడుదామని ఆర్టీసీ కార్మికులకు ఆయన పిలుపు ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement