కేసీఆర్‌ది కొంపముంచే సర్కార్‌: బండి సంజయ్‌

Bandi sanjay Fires On KTR BJP State Office Over TSPSC Paper Leak - Sakshi

సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు తెలంగాణలోనే జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రైతుల అప్పుల విషయంలోనూ తెలంగాణ నెంబర్‌ వన్‌ అని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. నేతల మధ్య సమన్వయమే లక్ష్యంగా సాగిన ఈ సమావేశానికి బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్‌, శివప్రకాశ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ హాజరయ్యారు.

కాగా ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ అర్వింద్‌ తప్పు పట్టిన తర్వాత తొలిసారి వీరిద్దరూ పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. 24 గంటలు కరెంట్‌ ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశాడు. 24 గంటల విద్యుత్‌ ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క రైతు బంధు ఇచ్చి మొత్తం సబ్సిడీ వ్యవస్థనే నాశనం చేశారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో కేటీఆర్‌కు సంబంధం ఉందని విమర్శించారు.

‘పేపర్‌ లీక్‌ కేసులో బీఆర్‌ఎస్‌ పెద్ద మనుషుల హస్తం ఉంది. ఈ కేసులో నాకు సంబంధం లేదని కేటీఆర్‌ అంటున్నాడు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్‌ ఆటలాడుకుంటున్నారు. కేసీఆర్‌ది కొంపముంచే సర్కార్‌. కాంగ్రెస్‌తో కలవలేం. కాంగ్రెస్‌ వస్తే మేము రాలేమని వైఎస్‌ షర్మిలకు చెప్పా. బీఆర్‌ఎస్‌తో కలిసి చేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పకనే చెబుతున్నారు’ అని బండిసంజయ్‌ అన్నారు.
 

కేసీఆర్‌ రైతులకు చేసిన ఘనకార్యం ఏమీ లేదని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. రైతులకు పంట నష్టపరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేకశారు.రైతులకు ఇచ్చే సబ్సిడీలు అన్నీ నిలిపివేశారని విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును ఇతర రాష్ట్రాల రైతులకు కాకుండా ముందు తమకు చూపాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో కేటీఆర్‌ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, సిట్‌.. కేసీఆర్‌ జేబు సంస్థ.. దానికి ఉపయోగం లేదన్నారు.

చదవండి: డేటా లీక్‌ కేసులో కీలక మలుపు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top