నేను ఉగ్రవాదినే.. అరెస్ట్‌ చేయండి : కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు

Arvind Kejriwal Reacted On Kumar Vishwas Comments - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ, ఆప్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసుకుంటున్నారు. నేతల తీవ్ర ఆరోపణతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజాగా ఆప్‌ మాజీ నేత కుమార్‌ విశ్వాస్‌.. ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ ‘పంజాబ్ సీఎం లేదా ఖలిస్తాన్ ప్రధానమంత్రి’ కావాలనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యాఖ్యలపై శుక్రవారం కేజ్రీవాల్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఉగ్రవాదినేని ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించి స్వీటెస్టు టెర్రరిస్టును(sweetest terrorist) అయ్యానంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం​ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. తాను వేర్పాటువాదిని అని ప్రధాని మోదీకి తెలిస్తే.. ఈ ఆరోపణలను ఎందుకు నిరూపించలేదని, దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తనను జాతీయ పార్టీల నేతలు(కాంగ్రెస్‌, బీజేపీ) దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్నారని, ఒక భాగానికి ప్రధానిని కావాలని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. తాను నిజంగా వేర్పాటు వాదిని, టెర్రరిస్టుని అయితే.. కేంద్ర భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి. ప్రధాని మోదీజీ నన్ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు. వారు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా అని మాటల తూటాలు పేల్చారు. ఈ సందర్భంగానే అన్ని పార్టీలు అవినీతిమయం అయ్యాయంటూ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఆప్‌ను ఓడించేందుకు అందరూ కలిసిపోయారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అంతకు ముందు కుమార్‌ విశ్వాస్‌ చేసిన ఆరోపణలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. కొందరు వ్యక్తులు పంజాబ్‌ను విభజించాలని కలలు కంటున్నారు. వారు అధికారంలోకి రావడం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. మరోవైపు 'వేర్పాటువాదం' ఆరోపణలపై విచారణ జరిపించాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రధాని మోదీని కోరారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 20వ తేదీన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుంది. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top