టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యత తీసుకున్నారా రామోజీ?

Article On Eenadu Ramoji Raos Baner Story - Sakshi

ఆంద్రప్రదేశ్‌లో  తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగానే కాకుండా, వర్కింగ్ అద్యక్ష బాద్యత కూడా ఈనాడు మీడియా అధినేత రామోజీరావు తీసుకున్నట్లుగా ఉంది. అచ్చంగా ఒక రాజకీయ పార్టీ మాదిరి వ్యవహరిస్తుండడమే కాకుండా, తెలుగుదేశం పార్టీని మించి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. మామూలుగా అయితే ఏదైనా కథనం ఇవ్వదలిచినప్పుడు ఏ పార్టీకి చెందని మీడియా అయితే రెండువైపులా ఉన్న వాదనలను ఇస్తుంటుంది. కానీ ఈనాడు మాత్రం పూర్తి ఏకపక్షంగా ,టీడీపీ నేతలకన్నా ఘోరంగా...కాదు..కాదు..నీచంగా వార్తలను వండి వార్చుతోంది.

ఈనాడుకి ఏమైంది?.. రామోజీకి మతి స్థిమితం తప్పిందా?
సోమవారం నాడు ఇచ్చిన బ్యానర్‌ కథనం చూసినవారికి ఎవరికైనా ఏమిటి? ఈనాడుకు ఏమైంది. రామోజీరావుకు పూర్తి మతి స్థిమితం తప్పిందా? అన్న సందేహం వస్తుంది. ఒక వైపు ఏపీకి భారీ స్థాయిలో పరిశ్రమలు,పెట్టుబడులు తెప్పించడానికి ప్రభుత్వం తపన పడుతుంటే ఏపీని నాశనం చేయడం ఎలా అన్న ధ్యేయంతో ఈనాడు పనిచేస్తోంది.పారిశ్రామిక సదస్సుకు వారం రోజుల ముందునుంచే చండాలపు కదనాలు ఇస్తూ పారిశ్రామికవేత్తలకు తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడినట్లు, ఇక్కడ అధికారపార్టీ, ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రచారం చేయడానికి ఈనాడు రామోజీరావు నడుం కట్టారు.   రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదట. గొంతెత్తితే  దాడులు జరుగుతున్నాయట. ఏ విమర్శను సహించడం  లేదట. వైకాపా నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారట. ప్రతిపక్షనేతలపై  దౌర్జన్యాలు, కొట్లాటలు దాడులు అట. వాక్ స్వాతంత్రమే లేదంటూ పచ్చి అభూత కల్పనతో బ్యానర్‌ కథనాన్ని ఇచ్చారు. మళ్లీ ఫ్యాక్షన్ వాతావరణం వచ్చిందని వారి మనసులోని ద్వేషాన్ని వెళ్లగక్కారు.

అది ఆత్మవంచన కాక మరేమిటి రామోజీ?
ఎవరు తప్పు చేసినా తప్పే.రెండువైపులా లోటుపాట్లను రాయవచ్చు. కానీ ఈనాడు మీడియా అలా చేయడం లేదు. గన్నవరంలో జరిగిన గొడవతో సహా ఎక్కడెక్కడి ఘటనలనో చిన్నా,చితకా వాటిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు పులుముతూ చెత్త కథనాన్ని ఇచ్చి ఈనాడు ఆత్మ సంతృప్తి చెందింది.  దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలన్న వారి దుష్ట తలంపు  అందరికి ఇట్టే తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీవారు  మహాత్మగాంధీ వారసులన్నట్లుగా, చంద్రబాబు, పట్టాభి వంటివారు స్వాతంత్రయోదులు అయినట్లు వార్తలు ఇస్తున్నారు. వారు  ముఖ్యమంత్రి జగన్ పైన, వైసీపీ నేతలపైన ఎలాంటి  దూషణలకు దిగినా, అవి పరమ పవిత్ర భాషణలుగా రామోజీ భావిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి ప్రతిపక్ష టీడీపీకి బాగా మేలు చేయవచ్చని రామోజీ భావిస్తుంటే, అది ఆత్మ వంచనే అవుతుంది. మాచర్లలో  పరిస్థితి రాక్షసత్వంగా  ఉందట. అక్కడ టీడీపీ నేత ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడంలో దిట్ట అయితే ఆయనలో గొప్ప ప్రజాస్వామ్యవాదిని ఈనాడు చూస్తోంది.ఇద్దరు టీడీపీ నేతలు ఘర్షణ పడితే వారిలో ఒకరిని వైసీపీవాడిగా చిత్రీకరిస్తూ వక్ర వార్తలు అందిస్తోంది. టీడీపీ పాలనలో జరిగిన అనేక ఘటనలను దాచిపెడుతూ ,ప్రజల చెవిలో పూలు పెట్టాలని విశ్వయత్నం చేస్తోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వివాదానికి సంబందించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం ఇవ్వాలని ఆయన ఇంటి వద్దకు  వెళ్లారు. పోలీసులు ఆయనను ముందుగానే నిలువరించారు. 

జగన్‌ ప్రభుత్వంపై రాళ్లు వేయడమే లక్ష్యంగా ..
అయినా ఈనాడు ఏమీ రాసిందో, ప్రసారం చేసిందో చూడండి. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దండయాత్రకు జోగి వెళ్లారట. ఇలాంటి పచ్చి  అబద్దాలను ప్రచారం చేయడానికి ఈనాడు మీడియా, ఆ సంస్థల అధినేత రామోజీరావు ఏ మాత్రం సిగ్గుపడడం లేదు. ఏ కథనంలో అయినా రెండో వర్షన్ ఉండాలని కనీస సూత్రాన్ని విస్మరించి జగన్ ప్రభుత్వంపై రాళ్లు వేయడమే లక్ష్యంగా ఈ మీడియా పనిచేస్తోంది. ఇంతవరకు  మరో రెండు టీడీపీ మీడియా సంస్థలే బట్టలూడదీసుకుని తిరుగుతున్నాయని అనుకునేవారం. కానీ వారితో పోటీలో తాము వెనుకబడుతున్నామని అనుకున్నారో ఏమో కానీ వీరు మారీచ వేషం కూడా వదలివేసి, మరీ నీచంగా బట్టలు లేకుండా తిరుగుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.కొద్ది రోజుల క్రితమే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగోలేదంటూ ఒక భారీ కథనాన్ని ఇచ్చింది. మళ్లీ వారం లోపే అదే తరహా వార్తను మళ్లీ ప్రచారంలో పెట్టడం ఆశ్చర్యంగా ఉంటుంది. జర్నలిజం ప్రాధమిక సూత్రాల ప్రకారం ఏదైనా ఒక కథనం ఒకసారి ఇస్తే,దానికి ఫాలో అప్ వార్త ఉంటే ఇస్తారు.అలాకాకుండా ఏకంగా మళ్లీ,మళ్లీ ఒకే తరహా వార్తను ఇస్తున్నారంటే ప్రజల మనసులలో విషం నింపాలన్న తాపత్రయం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారట. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారట. 

ప్రతిపక్షాలను బతకనివ్వడం లేదట. ఎన్ని అసత్యాలు చూడండి. అదే నిజమైతే ఈనాడు మీడియా ఇంత చండాలంగా వార్తలు రాయగలుగుతుందా?వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తమకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ, విషం ఎలా కక్కగలుగుతోంది?గతంలో చంద్రబాబు టైమ్ లో కాపు ఉద్యమ టైమ్ లో రెండు టివీ చానళ్లను బాన్ చేసినప్పుడు ఈనాడు మీడియా నోట్లో బెల్లం పెట్టుకుని కూర్చుంది. అంతేకాదు..అప్పట్లో సాక్షి మీద ముఖ్యమంత్రి హోదాలో విరుచుకుపడితే ఆయనలో ప్రజాస్వామ్యవాదిని చూసి ఈనాడు మురిసిపోయింది.

రామోజీ పతనం ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో మరి..!
మరో సంగతి చెప్పాలి. ఇదే మీడియా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసే అడ్డదిడ్డమైన ప్రకటనలను ,ప్రసంగాలను కవర్ చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. టీడీపీకి రాజకీయంగా నష్టం వస్తుందనుకున్నా, జనంలో నవ్వుల పాలు అవుతారని అనుకున్నా, వాటిని ఎడిట్ చేసి కథనాలు ఇస్తోంది. ఉదాహరణకు తెలంగాణ వారికి బియ్యం  అన్నం తినడం నేర్పింది తెలుగుదేశం అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే, దానిని కాస్త సరిచేసి ,మరికొంత ఎడిట్ చేసి ఆయనకు ఇబ్బంది లేకుండా వార్త ఇచ్చింది.ఈ రకంగా రామోజీరావు ఈనాడు మీడియాను తెలుగుదేశంకు తాకట్టు పెట్టేశారు. ఎలాగైనా ముఖ్యమంత్రి జగన్  ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో రామోజీరావు తానే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ బాధ్యత తీసుకున్నట్లుగా రెచ్చిపోయి రాస్తున్నారు. తన టీవీలో ప్రసారం చేస్తున్నారు. టీడీపీ చోటా నాయకుడు పట్టాభి అరాచకపు ప్రవర్తనకు, రామోజీరావు అరాచక రాతలకు పెద్ద తేడా లేకుండా పోవడమే విషాదం. రామోజీరావు పతనం ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో తెరపైనే చూడాలి.  
 -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top