పవన్ నోట.. పూటకో మాట.. | AP DYCM Pawan Kalyan Comments Over Film Industry | Sakshi
Sakshi News home page

పవన్ నోట.. పూటకో మాట..

May 25 2025 1:34 PM | Updated on May 25 2025 3:32 PM

AP DYCM Pawan Kalyan Comments Over Film Industry

పవన్ కళ్యాణ్‌కు రాజకీయం అబ్బకపోయినా దాన్నుంచి లాభాన్ని ఎలా పిండుకోవాలో మాత్రం బాగానే తెలుసు. అంటే పూటను బట్టి మాటను.. రోజును బట్టి అభిప్రాయం మార్చుకోవడంలో చంద్రబాబుకన్నా నాలుగైదు ఆకులు ఎక్కువే చదివేసారు పవన్. తనకు కులం మతం లేదని చెప్పే పవన్ మర్నాడే తాను యేసును నమ్ముతానని, తన బిడ్డలకు బాప్టిజం ఇప్పించానని చెబుతారు.

తనకు కులం లేదని చెప్పిన మరుక్షణమే తనకు కాపులంతా మద్దతుగా ఉండాలని డిమాండ్ చేస్తారు. గతంలో ఎన్నోసార్లు తన పరపతిని ఇమేజీని తెలుగుదేశానికి తాకట్టు పెడితే టీడీపీ నాయకులు.. కార్యకర్తలు తన తల్లిని తిట్టారని ఆవేదన చెందుతారు. ఆ  తరువాతి ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ చంక ఎక్కుతారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చి ఆంధ్రులను చిన్నచూపు చూసే ఢిల్లీ బీజేపీకి తాను ఎన్నడూ మోకరిల్లేది లేదని హుంకరిస్తారు.. ఆ తరువాత మళ్ళీ ఢిల్లీ వెళ్లి పెద్దల ముందు సాగిలపడతారు. తనను తెలుగుదేశం పార్టీ వాడుకుని వదిలేస్తుంది ఎన్నోమార్లు వగచే పవన్ మళ్ళీ ఆ టీడీపీ మోచేతి నీళ్లు తాగుతున్నారు.. ఇప్పుడు కూడా తనలో స్ల్పిట్‌ పర్సనాలిటీ ఉన్నట్లు మరోమారు రుజువుచేసుకున్నారు

వైయస్ జగన్ హయాంలో పవన్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. పనిలోపనిగా సినిమా ఇండస్ట్రీకి సైతం గార్డుగా ఊహించుకునేవారు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వైపు చూస్తే ఊరుకునేది లేదని.. ఆ వ్యవస్థ ఇక స్వయంచాలితం అని.. దాని వ్యాపారం.. సినిమాలు.. అనుమతులు.. టిక్కెట్ రేట్ల పెంపు వంటి వాటి అంశాలమీద ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదని.. అసలు ఎవరైనా సినిమా వ్యాపారం జోలికి వస్తే ఊరుకోనని బీరాలు పలికారు.  అంటే సినిమా టిక్కెట్ల ధరలు నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరు?. అంతా ఇండస్ట్రీ పెద్దల ఇష్టానుసారం జరగాలి తప్ప మధ్యలో ప్రభుత్వం ఎందుకు అనేది అయన ఉద్దేశ్యం.. పైగా నటులు ఎవరూ ప్రభుత్వ పెద్దలను నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలవాల్సిన అవసరం లేదన్నది ఆయన ఉద్దేశ్యంగా ఉండేది.

ఇపుడు అయన అధికారంలో ఉన్నారు.. చంద్రబాబు కేబినెట్లో నంబర్ టూ పాత్రలో.. డిప్యూటీ సీఎంగా పదవిలో ఉండేసరికి తనకు మళ్ళీ ఇండస్ట్రీనే గుర్తొచ్చింది. అసలు తాము ఎన్నికల్లో గెలిచాక తెలుగు సినిమా పెద్దలు.. నటులు.. నిర్మాతలు చంద్రబాబును కలవడానికి ఎందుకు రాలేదని పవన్ బాధపడిపోయారు. తన రాజకీయ యజమాని తరఫున వకాల్తా పుచ్చుకుని ఆయన ఇండస్ట్రీ పెద్దలను ప్రశ్నించారు.. అసలు మీకు కృతజ్ఞత ఉందా?. ఎన్నికల్లో గెలిచాక మీరు వచ్చి బాబును కలవాలని తెలియదా?. సినీ పరిశ్రమకు టీడీపీ ఎంతో చేసింది.. అలాంటిది మీరంతా వచ్చి చంద్రబాబును కలిసి మోకరిల్లాలని తెలియకపోతే ఎలా .. అంటూ ఏదేదో మాట్లాడారు. అంటే వైఎస్‌ జగన్ సీఎంగా ఉన్నపుడు మాత్రం సినీ పరిశ్రమ స్వతంత్రంగా ఉండాలి.. చంద్రబాబు గెలిస్తే మాత్రం వారంతా వచ్చి కలవాలి. మొత్తానికి రాజకీయం బాగా నేర్చి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు పవన్.. పూటకోమాట అంటూ ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు  
-సిమ్మాదిరప్పన్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement