సర్‌.. ఇంటికొస్తారు | - | Sakshi
Sakshi News home page

సర్‌.. ఇంటికొస్తారు

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

● జిల్లాలో నేటినుంచే ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ● ఓటర్లకు ఎన్యూమరేషన్‌ పత్రాలు ఇవ్వనున్న బీఎల్‌వోలు ● జూలై 24వ తేదీ వరకు ప్రతీ ఇంటికి మూడుసార్లు బీఎల్‌వోలు ● వివరాలు పూరించి వెనక్కి ఇస్తేనే ముసాయిదా జాబితాలో పేరు 80.89 శాతం మ్యాపింగ్‌ పూర్తి ఓటరుకు రెండు ఎన్యూమరేషన్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు 2002 జాబితాలో పేరు లేకపోతే..

జిల్లాలో ఓటర్ల వివరాలు

షెడ్యూల్‌ ఇది..

ప్రజలు సహకరించాలి

సాక్షి పెద్దపల్లి:

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే జిల్లాలో శుక్రవారం ప్రారంభంకానుంది. అర్హత ఉన్న ప్రతీఒక్కరికి ఓటుహక్కు కల్పించడంతోపాటు అనర్హులను తొలగించడానికి సర్‌ చేపట్టారు. జూలై 24వ తేదీ వరకు బూత్‌స్థాయి అధికారులు(బీఎల్‌వో) ప్రతీఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు నమోదు చేసుకుంటారు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉన్న ఎన్యూమరేషన్‌ ఫామ్‌లు ఇవ్వడానికి, నింపినవాటిని తీసుకోవడానికి మూడుసార్లు ఇంటింటా పర్యటిస్తారు. బీఎల్‌వోలకు ఇప్పటికే దీనిపై శిక్షణ పూర్తిచేశారు.

2002 నాటి ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్‌ చేశారు. జిల్లాలో 7,12,157 మంది ఓటర్లు ఉండగా, వారిలో 5,76,063మందికి (80.89శాతం) మ్యాపింగ్‌ పూర్తిచేశారు. ఓటరు జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్‌ ఫామ్‌తోపాటు, 2002 నాటి జాబితాలో వారి లేదా కుటుంబీకుల వివరాలు పొందుపరిచి ఇస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ అక్కర్లేదని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ కోసం బీఎల్‌వోలు ప్రతీ ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్తారు. ఒక్కో ఓటరుకు రెండు పత్రాలు అందిస్తారు. వాటిని ఎలానింపాలో వివరిస్తారు. నింపిన రెండింటిలో ఒకటి బీఎల్‌వో తీసుకుని, రెండోదానిని రసీదుగా అందిస్తారు. ఒకవేళ బీఎల్‌వో ఇంటికి రాకపోయినా, ఎన్యూమరేషన్‌ పత్రం అందించకపోయినా, లేదా ఆ సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోయినా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఎన్యూమరేషన్‌ పత్రం నింపొచ్చు.

ఈనెల 25 నుంచి బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉంటే కనీసం మూడుసార్లు సందర్శిస్తారు. అప్పటికీ వీలుకాకపోతే నోటీసు అందిస్తారు. ఓటర్లు తమ ఫారాలను నింపి నేరుగా బీఎల్‌వోకు ఇవ్వవచ్చు. లేదా ఓటర్స్‌.ఈసీఐ.గవ్‌.ఇన్‌ వెబ్‌పోర్టల్‌, ఈసీఐనెట్‌ మొబైల్‌ యాప్‌లో వివరాలు సమర్పించి రిజిష్టర్‌ చేసుకోవాలి. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌తో అనుసంధానం చేసి ఉన్న మొబైల్‌ నంబరుకు ఓటీపీతో ధ్రువీకరించడంతో డిజిటల్‌లో సర్‌ పక్రియ పూర్తవుతుంది.

2002 సంవత్సరం ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా? అని తెలుసుకోవడం కోసం పైన చెప్పిన పోర్టల్‌లోకి వెళ్లి సెర్చ్‌ బై ఎలక్టర్స్‌ డిటెయిల్స్‌ ఆప్షన్‌ నుంచి తెలుసుకోవచ్చు. వివిధ భాగాల వారీగా ఓటరు జాబితా పీడీఎఫ్‌ రూపంలోనూ అందుబాటులో ఉంటుంది. 2002 జాబితాలో పేరు లేకపోతే తల్లిదండ్రులు, లేదా వారి తల్లిదండ్రుల ఓటు వివరాలను సేకరించి ఎన్యూమరేషన్‌ పత్రంలోని సంబంధిత కాలమ్‌లో నింపాలి. వీటితోపాటు పుట్టిన తేదీ, ఆధార్‌, మొబైల్‌ నంబరు, కొత్త కలర్‌ ఫొటోలు అతికించి బీఎల్‌వోలకు ఇవ్వాలి. ఎన్యూమరేషన్‌ ఫారాలు ఒకవేళ ఇవ్వకపోయినా, పత్రం తీసుకోకపోయినా ఓటరు జాబితాలో పేరు దాదాపు కోల్పోయినట్లే. 2026 అక్టోబర్‌ ఒకటిలోపు 18 ఏళ్ల వయసు నిండిన ప్రతీపౌరుడు ఓటరుగా జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలి. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం అక్టోబర్‌ ఒకటిన ఓటరు తుదిజాబితా విడుదల చేస్తారు.

అసెంబ్లీ ఓటర్లు మ్యాపింగ్‌ ఐనవి మ్యాపింగ్‌ కానివి శాతం తేడాలున్నవి

రామగుండం 2,13,990 1,70,027 43,963 79.46 64,965

మంథని 2,38,765 1,95,826 42,939 82.02 61,370

పెద్దపల్లి 2,59,402 2,10,210 49,192 81.04 54,955

మొత్తం 7,12,157 5,76,063 1,36,094 80.89 1,81,290

జూన్‌ 25 నుంచి జూలై 24వరకు బీఎల్‌వోలు ప్రతీ ఇంటిని సందర్శించి ఓటరు వివరాలు సేకరిస్తారు

జూలై 24లోగా పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ

జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ

జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ

సెప్టెంబర్‌ 28లోగా అభ్యంతరాలు పూర్తిస్థాయిలో పరిష్కారం

అక్టోబరు ఒకటిన తుది ఓటరు జాబితా విడుదల

బీఎల్‌వోకు ఫారాలు అందజేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదు కాపీని ఓటరు అడిగి తీసుకోవాలి. సర్వే పూర్తయిన ఇళ్లకు ఎన్యూమరేషన్‌ కంప్లీట్‌ అనే స్టిక్కర్‌ అంటిస్తారు. ఒకే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటుహక్కు కలిగి ఉంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్‌–31 ప్రకారం శిక్షార్హులవుతారు. ప్రతీఒక్కరు బీఎల్‌వోలకు సహకరించాలి.

– కోయ శ్రీహర్ష, జిల్లా ఎన్నికల అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement