జ్యోతినగర్: బాలికలు విజయం సాధించడం కోసం విద్య, ఆత్మ విశ్వాసం, పట్టుదల ఎంతో ముఖ్యమని ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్ కాకతీయ ఆడిటోరియంలో బాలికా సాధికారత మిషన్–2026 ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంతతో కలిసి ఆయన మాట్లాడా రు. ఎన్టీపీసీ బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు నెలరోజుల పాటు అత్యుత్తమ శిక్షణ అందించిందన్నారు. ఇందులో ప్రతిభ కనభర్చిన 10 మంది విద్యార్థులకు ఉచిత విద్య కూడా అందించనున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందించారు. శిక్షణ పొందిన పలు అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. కమాన్‌పూర్, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాలకు చెందిన 140 మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి
పర్యావరణ పరిరక్షణకు ఎన్టీపీసీ కృషి చేస్తోందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాలికా సాధికారత మిషన్–2026లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులతో కలిసి ప్రభాత భేరికి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటి మాట్లాడారు.


