మేడారానికి 175 బస్సులు
పెద్దపల్లిరూరల్: మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు ప్రత్యేకంగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు సర్వంసిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుంచి 175 బస్సులను నడుపనున్నట్లు జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల డిపో మేనేజర్లు కల్పన, ప్రకాశ్‌రావు, మనోహర్ వివరించారు. పెద్దపల్లిలో బస్‌డిపో ఏర్పాటు చేసే విశాలమైన స్థలంలో బస్సులు నిలిపి ఉంచుతామని మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. జగిత్యాల డిపో నుంచి 95, కోరుట్ల నుంచి 44, సిరిసిల్ల డిపో నుంచి 36 బస్సులు పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మేడారం వరకు నడుపుతామని వారు వివరించారు. ఈనెల 25 నుంచి మేడారం జాతరకు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు.
మూడు ‘క్యూ’లైన్లు
స్థానిక ఆర్టీసీ బస్సుస్టేషన్ నుంచి మేడారం జాతరకు ఈనెల 25న ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జాతరకు వెళ్లేందుకు వచ్చే భక్తులు బస్సు ఎక్కేందుకు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్‌లో వెళ్లి టికెటు తీసుకుని అదేలైన్ ద్వారా బస్సు ఎక్కేలా ఏర్పాట్లు చేశామని మేనేజర్లు కల్పన, ప్రకాశ్‌రావు, మనోహర్ తెలిపారు. బస్టాండ్‌లో నిరీక్షించే వారి కోసం చలువపందిళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. బస్టాండ్ ఆవరణలో వైద్యశిబిరం, పోలీస్ అవుట్‌పోస్టు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు.
మహాలక్ష్మి పథకం వర్తింపు..
మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పఽథకాన్ని వర్తింపజేస్తున్నామని డిపో మేనేజర్లు పేర్కొన్నారు. పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.240 ప్రయాణ చార్జీలుగా నిర్ణయించినట్లు డిపో మేనేజర్లు వివరించారు. గతంలో కన్నా ఈసారి టికెట్ ధర రూ.40 పెరిగిందన్నారు. ఈమార్గంలో ఈసారి కొత్తగా రెండు టోల్‌గేట్‌లు ఏర్పాటు అయినందునే చార్జీలు స్వల్పంగా పెరిగాయని ఆర్టీసీ అధికారులు వివరించారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు
పెద్దపల్లి డిపో స్థలం నుంచే బస్సులు
మహిళలకు ఉచిత ప్రయాణం
ఆర్టీసీ డిపో మేనేజర్లు కల్పన, ప్రకాశ్‌రావు, మనోహర్


