వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు
పెద్దపల్లి: రాబోయే వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి ని వారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో డీ డబ్ల్యూఎస్‌ఎంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1నుంచి 20రోజుల పాటు గ్రామాల్లో తాగునీటి సరఫరాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, తాగునీటి సమస్యలుంటే పరిష్కరించి వేసవిలో ఇబ్బందులు రాకుండా సంసిద్ధం కావాల ని సూచించారు. సమీక్షలో జెడ్పీ సీఈవో నరేందర్, డీఆర్‌డీవో కాళిందిని, మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంసీహెచ్‌లో మెరుగైన వైద్యసేవలందించాలి
ఎంసీహెచ్‌లో మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లిలోని మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెల్స్‌డెస్క్, స్కానింగ్‌రూం, చిన్నపిల్లల, పలు వార్డులను పరిశీలించారు. ఫార్మసీలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ల్యాబ్‌లో రక్తపరీక్షల నిర్వహణకు పరికరాలు అవసరముంటే వివరాలందించాలన్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రి పనులను పరిశీలించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఉపాధి అవకాశాలు పెంచాలి
యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ/జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. టీజీఐపాస్ కింద నూతన పరిశ్రమల ఏర్పాటుకు చేసుకున్న దరఖాస్తును పరిశీలించి గడువులోగా అనుమతులు జారీ చేయాలన్నారు.
ఎస్టిమేషన్లు తయారు చేయాలి
రామగిరి: రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సమస్యలపై ఎస్టిమేషన్లు తయారు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో లద్నాపూర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ (లక్ష్మీనగర్ ప్లాట్స్) సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రత్నాపూర్, లద్నాపూర్, అక్కెపల్లి సర్పంచులు పల్లె ప్రతిమ, వనం రాంచందర్‌రావు, పెయ్యల సంధ్య, మంథని ఆర్డీవో కాసబోయిన సురేష్, ఆర్జీ–3 జీఎం సుంకర మధుసూదన్, రామగిరి తహసీల్దార్, ఎంపీడీవో సుమన్, ఆర్జీ–3 ఎస్టేట్ ఆఫీసర్ కనవేన ఐలయ్య, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ చందుపట్ల మణిదీప్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


