బరిలో ఉంటున్నా.. దీవించండి
షెడ్యూల్‌కు ముందే ప్రలోభాలకు తెర చీరలు, రైస్‌కుక్కర్, మద్యం, చికెన్, దావత్‌లతో సందడి నోటిఫికేషన్‌కు ముందే బల్దియాల్లో వేడెక్కిన రాజకీయం
సాక్షి పెద్దపల్లి: పోలింగ్ ముందు రోజు రాత్రి చేపట్టే పంపకాలు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందే జిల్లాలోని బల్దియాల్లో మొదలైంది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌కి ముందే రాజకీయం వేడెక్కింది. రిజర్వేషన్ ఖరారుతో అభ్యర్థుల హడావిడి మొదలైంది. ఓటర్లను పరిచయం చేసుకుంటూనే ముందస్తుగా ప్రలోభాలకు తెరతీస్తూ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌తో పోలీసుల, ప్రత్యర్థుల నిఘా పెరుగుతుందని భావించటంతో పాటు, ఎన్నికల వ్యయం లెక్కలోకి వస్తుందని ఆశవహులు ముందస్తు ప్రలోభాలకు తెరతీస్తున్నట్లు సమాచారం.
మటన్, చికెన్, లిక్కర్ పంపిణీ
ఎమ్మెల్యే టికెట్ కన్ఫార్మ్ చేశారు అంటూ ఆయా వా ర్డుల్లో తమ ఫొటోలతో ఫెక్ల్సీలు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా ఇంటింటికీ కిలో చికెన్, క్వార్టర్ బాటిల్‌లు, చీరలు పంపిణీ చేస్తున్నారు. మరికొంద రు ఆయా వార్డుల్లో ముఖ్యమైన కాలనీపెద్దలకు దా వత్‌లు ఇస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇలా ఉంటే, పోలింగ్ నాటికి వార్డుల్లో పరిస్థితి ఎలా ఉంటోదని ఓటర్లు చర్చించుకుంటున్నారు.
‘అన్నా నమస్తే.. అక్కా నమస్తే.. నేను ఈసారి మీ వార్డులో పోటీచేస్తున్న. మీరందరూ నన్ను ఆశీర్వదించాలి’ అంటూ ఓటర్లను పరిచయం చేసుకుంటూనే ఆశావహులు తోచిన విధంగా చీరలు, రైస్‌కుక్కర్లు, లిక్కర్, చికెన్ పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీస్తూ, ఫ్లెక్సీలతో వార్డుల్లో సందడి చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా వార్డులోని ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరిస్తూ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తూ ‘ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న మీరందరూ నన్ను ఆశీర్వదించండి’అంటూ పోస్టులతో హోరెత్తిస్తూ, ఎన్నికల వేడిని పెంచుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ పరిచయం చేసుకుంటూ ఓటు వేసి దీవించాలంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
రిజర్వేషన్లు కలిసి రాక..
రామగుండం కార్పొరేషన్ సహా మూడు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులపై కన్నేసిన ఆశావహులు, వారు ఉన్న వార్డుల్లో వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంచి, చెడు కార్యక్రమాలకు హాజరై వార్డు ప్రజలతో మమేకమయ్యారు. తీరా రిజర్వేషన్ ప్రకటించగా, తాము పోటిచేద్దాం అనుకున్న వార్డులో రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో తలలు పట్టుకున్నారు. చేసేది లేక తమకు అనుకూలంగా ఉన్న పక్క వార్డుల్లో పోటీచేసేందుకు సమయాత్తం అవుతున్నారు. ఈనేపథ్యంలో ఆయా వార్డుల ప్రజలతో పరిచయం అయ్యేందుకు, వారితో మమేకం అయ్యేందుకు ముందస్తుగా పంపకాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అశావహులు తెలుపుతున్నారు.


