కరెంట్ సమస్యలేమైనా ఉన్నాయా?
మంథనిరూరల్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వారంలో మూడు రోజులపాటు పల్లెబాట చేపట్టిన ట్రాన్స్‌కో అధికారులు.. ఆ దిశగా సత్ఫలితాలు సాధిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారులు పల్లెబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట పేరిట ప్రస్తుతం పల్లెబాట పట్టారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలనతో పాటు ప్రజలు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.
జిల్లాలోని 263 గ్రామపంచాయతీల్లో..
జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లోని 263 గ్రామపంచాయతీల్లో విద్యుత్ అధికారులు ప్రజాబాట చేపట్టారు. ఆయా గ్రామాలను సందర్శించి స్థానికులు, వినియోగదారులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో సైతం ప్రజాబాట నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
వారంలో మూడు రోజులు..
వారంలో మూడు రోజులు విద్యుత్ అధికారులు తమ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ప్రజాబాట చేపడుతున్నారు. మంగళ, గురు, శనివారాల్లో మండల స్థాయిలోని ఏడీఈ, ఏఈ, లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్‌లు గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గృహావసరాలు, వ్యవసాయ సంబంధిత సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. అధికారులు పర్యటిస్తున్నా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయా? అని పలువురు రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సమస్యల గుర్తింపు..
ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన విద్యుత్ అధికారులు.. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తిస్తున్నారు. ఇందులో సమస్య తీవ్రతను బట్టి పరిష్కారం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏబీ స్విచ్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ముళ్ల పొదల తొలగింపు, లైన్‌లకు మరమ్మతులు లాంటి సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతున్నామని, ఏదైనా ఖర్చుతో కూడిన సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఇది నిరంతర ప్రక్రియ
విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ప్రజాబాట నిరంతర ప్రక్రియ. వారంలో మూడురోజులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తిస్తున్నాం. సమస్య తీవ్రతను బట్టి అక్కడే పరిష్కారం చూపుతున్నాం. అవసరమైనచోట నిధులు కేటాయించి సమస్య తలెత్తకుండా చూస్తున్నాం. ప్రజాబాటతో ఇటు రైతులకు, అటు గృహవినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
– గంగాధర్, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్
గ్రామాల్లో విద్యుత్ అధికారుల ఆరా
ప్రజాబాట పేరిట పల్లెబాట
గృహ, వ్యవసాయ సమస్యల గుర్తింపు


