అభివృద్ధి పనులకు నిధులివ్వండి
పదేళ్లపాటు రామగుండం నగరం గత పాలకుల నిర్లక్ష్యానికి గురైందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్ 18 వేల మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారని, మరో 7వేల వరకు పట్టాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. నగరంలో మరో తహసీల్దార్ కార్యాలయం, జూనియర్ కళాశాల భవనం కావాలని మంత్రులను కోరారు. 50మంది ట్రాన్స్‌జెండర్లకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి మరో రూ.50 కోట్లు మంజూరు చేయాలని, 1,100 ఏళ్లనాటి త్రిలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని పురావస్తుశాఖ ద్వారా రూ.12 కోట్లతో అభివృద్ధి చేయాలని కోరారు. నగరంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని, తన సోదరుడు కూడా ఇదే సమస్యతో మరణించాడని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు సింగరేణి వెంటనే క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈవిషయంలో డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోవాలని విన్నవించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, ఆర్డీవో గంగయ్య తదితరులు పాల్గొన్నారు.


