మేడారానికి పెద్దపల్లి డిపో బస్సులు
● ఆర్టీసీ అధికారుల అభ్యర్థన ● తిరస్కరించిన ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు పెద్దపల్లి డిపో నుంచి బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులు యోచించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. పెద్దపల్లి డిపో పేరిట ఆర్టీసీ బస్సులను జాతరకు నడిపితే పెద్దపల్లిలో డిపో ఏర్పాటైనట్లు చాలామందికి తెలిసిపోతుందని వివరించినట్లు తెలిసింది. అందుకు విముఖత వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు.. సంక్రాంతి పండుగ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్‌తో బస్సు డిపో ప్రారంభించుకుందామని చెప్పినట్లు సమాచారం.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
పెద్దపల్లిరూరల్/పెద్దపల్లి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక చిట్టేటివాడ, శ్రీరాంనగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఇందిరమ్మ లబ్ధిదారులకు శుక్రవారం ఆయ న ప్రొసీడింగ్స్ అందజేసి మాట్లాడారు. ప్రతీపేద కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ధ్యేయమన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్, నాయకులు పాగాల సోని, శ్రీకాంత్, జడల సురేందర్, కొట్టె సదానందం, తిరుపతి, రవి తదితరులు ఉన్నారు.


