సమయపాలన పాటించాలి
● జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్
పెద్దపల్లి: ఆర్‌బీఎస్‌కే (రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం) ఉద్యోగులు సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్ సూచించారు. గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పాఠశాలల విద్యార్థుల్లో జన్యు లోపాలు ఉన్న పిల్లల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, పాఠశాలలో జరుగుతున్న కంటి స్క్రీనింగ్ కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించాలని సూచించారు. అనంతరం ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష నిర్వహించారు. వైద్య అధికారులు సూచించిన డయాగ్నొస్టిక్ పరీక్షల కోసం రక్త నమూనాలను సేకరించి సకాలంలో టీ–హబ్ పెద్దపల్లికి పంపాలని సూచించారు. స్టాక్, ల్యాబ్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులు బి.శ్రీరాములు, కిరణ్‌కుమార్, కేవీ సుధాకర్‌రెడ్డి, ఎంపీహెచ్‌ఈవో రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


