లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
● సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య
గోదావరిఖని: కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య డిమాండ్‌చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక శ్రామిక భవన్‌లో బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులు కాలరాస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేసిందని ధ్వజమెత్తారు. వామపక్షాల కృషితో 2025లో వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం గాంధీ పేరుని తీసి జీరాంజీగా మార్చడమేకాక దాని మౌలిక స్వభావాన్ని మార్చేసిందని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టి ప్రీపెయిడ్ విధానం తీసుకురానుందని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్సిడీలను రద్దు చేసే కుట్ర చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 19న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.రాజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, నాయకులు బిక్షపతి, జ్యోతి, ఎం.రామాచారి, మెండే శ్రీనివాస్, దోమ్మెటి కొమురయ్య, టి.అంజయ్య, ఎన్.నర్సయ్య, కె.పర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


