మధ్యవర్తిత్వంతోనే కేసుల పరిష్కారం
పెద్దపల్లి: మధ్యవర్తిత్వంతోనే అత్యధిక కేసులు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. స్థానిక జిల్లా కోర్టు భవనంలో శ్రీన్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వంశ్రీ అంశంపై బుధవారం జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. కేసుల సంఖ్య పెరుగుతోందని, కోర్టులపై భారం అధికమవుతోందన్నారు. న్యాయం పొందేందుకు కక్షిదారులు ఎక్కువకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కార మార్గంగా మధ్యవర్తిత్యం ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. ఇరుపక్షాల మధ్య సంబంధాలు చెడిపోకుండా సమస్యకు ముగింపు లభిస్తుందని తెలిపారు. సివిల్, కుటుంబ, ఆస్తి, వాణిజ్య తదితర కేసుల్లో మధ్యవర్తిత్యం విజయవంతంగా అమలవుతోందని వివరించారు. జిల్లా అదనపు న్యాయమూర్తి స్వప్నరాణి, సీనియర్ సివిల్ జడ్జి భవాని, జూనియర్ సివిల్ జడ్జి మంజుల తదితరులు పాల్గొన్నారు.


