‘ఆపరేషన్ కగార్’ను ఆపేయండి : ప్రజాసంఘాలు
పెద్దపల్లిరూరల్: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలోని ఆదివాసీలపై సాగిస్తున్న దమనకాండను వెంటనే ఆపేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట మంగళవారం సంఘీభావ పోరాట వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న, జిన్నం ప్రసాద్, గుమ్మడి కొమురయ్య తదితరుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రూ.కోట్ల విలువైన సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈక్రమంలోనే ఆదివాసీలపై దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఈనెల 20న కరీంనగర్‌లో చేపట్టిన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్, రామిళ్ల బాపు, శ్రీపతి రాజగోపాల్, శ్రీనివాస్, వెంకన్న, బాపన్న, సదానందం, గాండ్ల మల్లేశం, రాజు, ఎరుకల రాజన్న తదితరులు పాల్గొన్నారు.
పనులు నాణ్యతగా ఉండాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): విద్యార్థుల యూనిఫామ్స్‌ను నాణ్యంగా కుట్టాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. స్థానిక ఐకేపీ కార్యాలయంలో కొనసాగుతున్న కుట్టు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులు అప్పగిస్తున్నామని, ఇందుకోసం ఆసక్తిగలవారికి శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ట్రెయినర్ వసుంధర పాల్గొన్నారు.
ఇందిరమ్మ మోడల్ ఇల్లు సిద్ధం
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ఎంపీడీవో కార్యాలయం వెనకాల చేపట్టిన మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. దీంతో మంగళవారం రంగులు వేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. లబ్ధిదారులు ఈ ఇంటిని చూసి తమ ఇళ్లను ఇలాగే నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
8వ డాన్‌గా కరాటే మొండయ్య
గోదావరిఖనిటౌన్: సికింద్రాబాద్‌లో ఇటీవల జరిగిన ఆల్ ఇండియా కరాటే సీనియర్ గ్రేడింగ్ టెస్ట్‌లో గోదావరిఖనికి చెందిన కరాటే మొండయ్య 7వ డాన్ నుంచి ఎనిమిదో డాన్‌కు ప్ర మోట్ అయ్యారు. దేశవ్యాప్తంగా పేరొందిన 10మంది డాన్‌లు ఈ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఏడుగురికి ప్రమోట్ అవకాశం దక్కింద ని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమానికి ము ఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ విజేతలను అభినందించారు. అనంతరం 10వ డాన్ శ్రీనివాసన్ బెల్ట్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు.
సత్ప్రవర్తనతో మెలగాలి
పెద్దపల్లిరూరల్: రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని డీసీపీ కరుణాకర్ సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి మంగళవారం రౌడీషీటర్లతో సమావేశమై పలు సూచనలిచ్చారు. క్రిమినల్ కేసులు, భూదందాల్లో తలదూరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, లక్ష్మణ్, స్వామి పాల్గొన్నారు.
‘ఆపరేషన్ కగార్’ను ఆపేయండి : ప్రజాసంఘాలు


