● బొగ్గుగనుల ప్రైవేటీకరణ, లేబర్ కోడ్‌ల రద్దు కోసం ● మే 20న టోకెన్ సమ్మెకు జాతీయ సంఘాలు సై
గోదావరిఖని(రామగుండం): సింగరేణిలో సమ్మైసెరన్ మోగనుంది. ప్రభుత్వ రంగ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఒక్క రోజు సమ్మెకు జాతీయ సంఘాలు సై అంటున్నాయి. మే 20న ఒక్కరోజు టోకెన్ సమ్మె విజ యవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
జాతీయ సంఘాల పిలుపు మేరకు..
కేంద్రప్రభుత్వం బొగ్గు గనుల్లో కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. దీనిద్వారా కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. బొగ్గు వెలికితీత పనులు పూర్తిగా పర్మినెంట్ కార్మికులతో చేయించాలని కోరుతున్నాయి. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు టోకెన్ సమ్మె చేపట్టాలని, దీనికి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సింగరేణి కార్మికులు పూర్తి స్థాయి మద్దతు పలికి విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కోల్‌బ్లాక్‌ల వేలంలో సత్తుపల్లి ఓసీపీని ప్రైవేట్ సంస్థకు అప్పగించగా ఓసీపీ ఓబీ మట్టిపోయడానికి స్థలం లేదని, సింగరేణి సంస్థ అప్పగించవద్దని, తాడిచర్ల– 2, వెంకటాపూర్ గనులు సింగరేణికే అప్పగించి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి.
ప్రధాన డిమాండ్లు ఇవే..
● రద్దు చేసిన కార్మిక చట్టాలను తిరిగి కొనసాగించాలి. కోడ్‌ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి.
● ఇది చట్టవిరుద్ధమైన కోల్ ఆపరేషన్ ప్రైవేట్‌వారితో తీయించడం మానుకోవాలి.
● సత్తుపల్లి ఓసీపీ ప్రైవేట్ సంస్థ ఓబీని సింగరేణి భూమిలో పోయడానికి అవకాశం ఇవ్వొద్దు
● తాడిచర్ల–2, వెంకటాపూర్ గనులను సింగరేణికే ఇవ్వాలి.
● సింగరేణికి రావాల్సిన రూ.40వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించి సంస్థను ఆదుకోవాలి.
● సంస్థలో నూతన గనులు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.


