● జగిత్యాల – కరీంనగర్ సెక్షన్ పాత టెండరు రద్దు ● సాంకేతిక కారణాలతోనే రద్దయినట్లు సమాచారం ● తాజాగా రూ.1,779 కోట్లతో మరో టెండరు ● రూ.276 కోట్ల వరకు పెరిగిన అంచనా వ్యయం ● వేగంగా కరీంనగర్ – వరంగల్ సెక్షన్ పనులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఛత్తీస్‌గఢ్ నుంచి మహా రా ష్ట్ర.. రెండు రాష్ట్రాలను కలిపే ప్రతిష్టాత్మక జాతీయ రహదారి ఎన్‌హెచ్ –563 టెండర్ కొత్త మలుపు తి రిగింది. గత జూలైలో కరీంనగర్–జగిత్యాల సెక్షన్ కు సంబంధించి రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్‌ఎఫ్‌పీ) టెండర్ల అంచనా వ్యయాలు ఖరారు అయ్యాయి. దాదాపు రూ.2,227 కోట్లతో టెండరుకు అంచనా వ్యయం కూడా రూపొందాయి. ఈ మేరకు టెండర్లు వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. విశ్వసనీయ స మాచారం మేరకు.. వివిధ సాంకేతిక కారణాలతో పాత అంచనాలతో రూపొందించిన టెండర్లు రద్దు అయ్యాయి. తాజాగా రూ.1,779 కోట్లతో ఆర్‌ఎఫ్‌పీ టెండర్లు పిలిచారు. మొత్తం 58.86 కిమీ పొడవైన ఈ రహదారి కరీంనగర్ బైపాస్ (కొత్తపల్లి సమీపంలో) నుంచి జగిత్యాల వరకు నాలుగు లేన్ల రహదా రిగా వేయనున్నారు. గతంలో ఈ రోడ్డు ఖర్చు ప్రతీ కి.మీ.కు రూ.37 కోట్ల వరకు అంచనా వ్యయంగా ఉండటం గమనార్హం. అధునాతన సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ జాతీయ రహదా రి నిర్మాణం కానుంది. ఈ మార్గంలో దాదాపు 241 హెక్టార్ల భూసేకరణ కోసం దాదాపు రూ.387 కోట్లు కేటాయించారు. వాస్తవానికి గతంలో అంచనా వ్య యం రూ.1,503 కోట్లు మాత్రమే. (వీటికి జీఎస్టీ, భూసేకరణ కలుపుకుంటే అది రూ.2,227 కోట్ల వ రకు చేరింది.) తాజాగా టెండరు ప్రకారం.. రూ. 1,779 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగినట్లు సమాచారం. ఈ లెక్కన రూ.276 కోట్ల అంచనా వ్యయం పెరిగిందని సమాచారం. తాజా టెండర్ అంచనా వ్యయంలో జీఎస్టీ కలిసిందా? లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మార్కెట్‌లో పలు ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయం పెరిగి ఉండవచ్చని సమాచారం.
వేగంగా రహదారి పనులు..
ఈ సెక్షన్‌లో కీలకమైన కరీంనగర్–వరంగల్ సెక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. గతంలో మోదీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ పనులు చేపట్టారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ముఖ్య నగరాలైన వరంగల్– కరీంనగర్ పట్టణాలను కలిపే 68 కి.మీ.ల ప్రతిష్టాత్మక రహదారి. దీన్ని 2025 జూలై నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం సమీపంలో టోల్‌గేట్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అదే సమయంలో మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి వద్ద నిర్మించతలపెట్టిన బైపాస్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి.
వరంగల్–కరీంనగర్ సెక్షన్
దూరం 68 కి.మీ
అంచనా రూ.2,146 కోట్లు
గడువు 16–7–2025
మానకొండూరు బైపాస్ 9.44 కి.మీ
తాడికల్ బైపాస్ 6.65 కిమీ
హుజూరాబాద్ బైపాస్ 15.05
ఎల్కతుర్తి బైపాస్ 4.60 కిమీ
హసన్‌పర్తి బైపాస్ 9.57 కిమీ
మైనర్ జంక్షన్లు 29
కరీంనగర్–జగిత్యాల సెక్షన్
దూరం 58.8 కిమీ
అంచనా రూ.1,779 కోట్లు
(జీఎస్టీపై స్పష్టత రావాల్సి ఉంది)
బ్రిడ్జిలు 24
ఆర్వోబీ/ఆర్‌యూబీ 03
మేజర్ జంక్షన్లు 27
మైనర్ జంక్షన్లు 29
టోల్‌ప్లాజా గంగాధర–
తుర్కాశీనగర్ సమీపంలో (అంచనా)
ట్రక్ బే టోల్‌ప్లాజా
సమీపంలోనే (2 కి.మీలోపే)
రెస్ట్ ఏరియా జగిత్యాల
సమీపంలో..