● కొనసా..గుతున్న రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ● ఇబ్బంది పడుతున్న పట్టణవాసులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులు నత్తనడకన సా..గుతున్నాయి. రెండు నెలల క్రితం చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ప్రధాన రోడ్లపై రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మజీద్ ప్రాంతం నుంచి అమర్‌నగర్ వరకు, దేవికిరోడ్ నుంచి ఎల్లమ్మ చెరువు కట్ట వరకు రోడ్డు విస్తరించేందుకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేశారు. ఇళ్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులపై పలువురు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో డ్రైనేజీలపై గద్దెలు నిర్మించుకునేలా విస్తరణ పనులు కొనసాగిస్తున్నారు.
ధ్వంసమైన పైపులు
రోడ్డు విస్తరణ పనుల్లో పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేసే పైపులు అక్కడక్కడ ధ్వంసమయ్యాయి. వాటిని గుర్తించి తిరిగి పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆకుల వెంకటేశ్ సంబంధిత అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
మేన్‌రోడ్డు విస్తరణ మాటేమిటీ?
పట్టణంలో ప్రధానమైన మేన్‌రోడ్డును వ్యాపారులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేయడంతో ఇరుకుగా మారింది. వాహనాలు ఎదురుపడితే రోడ్డు జామ్ అవుతోంది. ఈ మార్గంలోనే బట్టలు, కిరాణం, స్టీల్ తదితర దుకాణాలు ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. తమకు అవసరమైన సామగ్రిని కొనేందుకు వచ్చిన వారు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపితే రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో మున్సిపాలిటీగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్డుగా ఉన్న మేన్‌రోడ్డు ఆ తర్వాత మేజర్‌పంచాయతీగా పెద్దపల్లి మారడంతో రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు ముందుకు పెంచడంతోనే రోడ్డు ఇరుకుగా మారిందంటున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రధానమైన మేన్‌రోడ్డును ఖచ్చితంగా విస్తరించాలంటూ పట్టణానికి చెందిన నారాయణ్‌దాస్ తివారీ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో స్పందించిన కలెక్టర్ ఈ విషయమై దృష్టిసారించాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మేన్‌రోడ్డు విస్తరణ జరిగితేనే జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి కొత్త శోభ సంతరించడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తయ్యేలా చూడాలి
పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి.. ప్రధాన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు వాహన, పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. కమాన్‌నుంచి జెండా, దేవిడి నుంచి చాకలిఐలమ్మ విగ్రహం, శివాలయం ప్రధానద్వారం నుంచి అమర్‌నగర్ వరకు పనులు సత్వరమే పూర్తయ్యేలా చూడాలి.
– రాకేశ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు, పెద్దపల్లి
త్వరలో పూర్తి చేస్తాం
పట్టణంలోని ప్రధాన రోడ్లకిరుపక్కలా విస్తరణ పనులు చేపట్టి డ్రైనేజీలు నిర్మించాల్సి రావడం వల్లే కొంత జాప్యం జరుగుతోంది. మిగతా అంతర్గత రోడ్ల ను సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. వీలైనంత త్వరగానే పనులు పూర్తిచేస్తాం.
– సతీశ్, ఏఈ, మున్సిపాలిటీ, పెద్దపల్లి
నత్తనడకన రహదారి విస్తరణ
నత్తనడకన రహదారి విస్తరణ