
పెద్దపల్లి: మహిళా సంఘం సభ్యుల లోన్ డబ్బులు బ్యాంకులో కట్టేందుకు వెళ్తుండగా.. దారిలో డబ్బు పడిపోవడంతో మాట పడాల్సి వస్తుందని మనస్తాపం చెందిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై విజేందర్, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లె గ్రామానికి చెందిన గడిపల్లి సమ్మయ్య (33) గ్రామశివారులోని రైస్‌మిల్లులో ఆపరేటర్. అతడి భార్య సృజన మహిళ స్వశక్తి సంఘంలో సభ్యురాలు. బ్యాంక్ ద్వారా తీసుకున్న లోన్ కట్టేందుకు సంఘం సభ్యులు నెలవారీగా వంతు పెట్టుకున్నారు.
ఈక్రమంలో ఈనెల లోన్ కట్టే వంతు సృజనకు రాగా, 14వ తేదీన రూ.22వేలు బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు సమ్మయ్య వెళ్తుండగా, దారిలో ఎక్కడో డబ్బులు పడిపోయాయి. దీంతో డబ్బులు కట్టకపోతే గ్రూపు సభ్యులతో ఎక్కడ మాట పడాల్సి వస్తుందో అని మనస్తాపం చెందిన సమ్మయ్య శనివారం వేకువజామున రైస్‌మిల్లులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఏడాదిలోపు వయస్సుగల పాప ఉంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com