● పురుగు మందు డబ్బాలతో
తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ రైతుల ధర్నా
రామభద్రపురం: కాళ్లరిగేలా తిరుగుతున్నా తమ భూ సమస్యను పరిష్కరించడంలేదని, ఇక చావే శరణ్యమంటూ రామభద్రపురం మండలం ఇట్లామామిడిపల్లి ఎస్సీ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పురుగు మందు డబ్బాలు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 161లో ఎస్సీలకు చెందిన సుమారు 3 ఎకరాల భూమిని విజయనగరానికి చెందిన ఓ పెత్తందారు కబ్జాచేసి కంచె ఏర్పాటు చేశాడని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదని ఆరోపించారు. సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ బుధవారం భూమిని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.


