సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితాలను శుక్రవారం ప్రచురించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 15 జెడ్పీటీసీ స్థానాలకు.. 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన జాబితాలను ప్రచురించినట్లు ఉమ్మడి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎ.లవరాజు తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లోనూ.. 15 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ కార్యా లయంతో పాటు.. పార్వతీపురం డివిజనల్ అభి వృద్ధి కార్యాలయంలోనూ ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి జిల్లా పరిషత్ ఉమ్మడి విజయనగరంలో కలిసి ఉండటం వల్ల గత జిల్లా ప్రాతిపదికనే తీసుకున్నారు. జిల్లా పరిషత్ పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి మార్గదర్శకాలూ విడుదల కాలేదు. మన్యం జిల్లా లో సుమారు 6.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 24వ తేదీతో ప్రస్తుత పాలక వర్గం ముగియనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికనే వచ్చే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.


