బలవంతపు వసూళ్లకు పాల్పడిన ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బలవంతపు వసూళ్లకు పాల్పడిన ముగ్గురి అరెస్టు

Aug 28 2026 1:15 AM | Updated on Aug 28 2026 1:15 AM

బలవంతపు వసూళ్లకు పాల్పడిన ముగ్గురి అరెస్టు

రాజాం సిటీ: ఇటీవల బెయిల్‌పై వచ్చిన రౌడీషీటర్‌ తన పంథాను మార్చుకోకుండా మరో ఇద్దరితో కలసి బలవంతపు వసూళ్లకు పాల్పడి మళ్లీ జైలు పాలయ్యాడు. ఈ ఘటన రాజాం మున్సిపాల్టీ పరిధి గోపాలపురం వెళ్లేదారిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి టౌన్‌ సర్కిల్‌ కార్యాలయంలో గురువారం టౌన్‌ సీఐ డి.నవీన్‌కుమార్‌ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మున్సిపాల్టీ పరిధి గోపాలపురానికి చెందిన మేకల శేఖర్‌బాబు వ్యక్తిగత పనిపై ఈ నెల 26న రాజాం వచ్చి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళ్తున్నాడు. వర్షం కురుస్తుండడంతో పోలిపల్లి పైడితల్లి ఆలయ వద్ద కొంత సమయం ఆగిన తరువాత 7 గంటలకు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో మెంతిపేట ఎస్సీ కాలనీకి చెందిన సిరిపురపు దేవరాజు, మరో ఇద్దరు నిందితులు మండల పరిధి పెనుబాక గ్రామానికి చెందిన బోనెల దుర్గాప్రసాద్‌, బి.దిలీప్‌కుమార్‌లతో కలసి ఇంటికి బయలుదేరుతున్న శేఖర్‌ బాబు వద్దకు వచ్చాడు. తనకు డబ్బులు ఇవ్వాలని, ద్విచక్ర వాహనం కూడా ఇవ్వాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉండడంతో పాటు చంపేస్తామని బెదించారు. ప్రాణహాని ఉందనే భయంతో చేసేదేమీ లేక తన వద్ద ఉన్న రూ.1000లతో పాటు ద్విచక్ర వాహనాన్ని వారికి అప్పగించాడు. ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తానని మరోసారి బెదించడంతో అక్కడ నుంచి స్వగ్రామం వెళ్లిపోయాడు. ఈ విషయంపై బాధితుడు గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ మహ్మద్‌ సల్మాన్‌ బేగ్‌ నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు హాజరుపర్చామని సీఐ తెలిపారు.

తీరు మారకపోతే పీడీ యాక్ట్‌

రౌడీషీటర్ల తీరుమారకపోతే పీడీ యాక్ట్‌ అమలు చేయనున్నామని సీఐ నవీన్‌కుమార్‌ హెచ్చరించారు. ఇదే కేసులో ఏ1 నిందితుడు అయిన సిరిపురపు దేవరాజుపై ఇప్పటికే 11 కేసులు ఉన్నాయని తెలిపారు. అలాగే గత నెల 27న ఫైర్‌స్టేషన్‌ వెనుక తోటలో మద్యం సేవిస్తున్న ఇద్దరిని బెదించిన కేసులో అరెస్టు అయి 14 రోజుల రిమాండ్‌ అనుభవించి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడని చెప్పారు. అయినప్పటికీ అతని తీరులో మార్పు రాకపోగా మళ్లీ గోపాలపురంకు చెందిన శేఖర్‌బాబును బెదిరించాడని తెలిపారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి జరిగిందని, మరోసారి ఇలాగే జరిగితే పీడీ యాక్ట్‌ అమలు చేయనున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement