● కాలయాపన చేస్తే భారీ ఉద్యమం తప్పదు
విజయనగరం గంటస్తంభం: అగ్రిగోల్డ్ బాధితుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించొద్దని, డిపాజిటర్ల సొమ్మును పూర్తిగా చెల్లించే వరకు పోరాటం ఆపేది లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. విజయనగరంలోని డీఎన్‌ఆర్ అమర్ భవన్‌లో గురువారం జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 ఏళ్లుగా బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నా ప్రభుత్వాలు కాలయాపన చేయడం దారుణమన్నారు. ఉద్యమాల ఫలితంగా ఇప్పటివరకు సుమారు రూ.900 కోట్లు బాధితులకు చెల్లించేలా సాధించామని, ఇంకా వేలాది కుటుంబాలకు సొమ్ము అందాల్సి ఉందన్నారు. మాటలు, హామీలతో కాలం గడపకుండా బాధితుల సొమ్మును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే బాధితులు, ఏజెంట్లను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మన డబ్బు..మన హక్కు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


