రాజాం సిటీ: తాను తయారుచేసిన చిత్రాలయ యాప్‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో చోటు లభించిందని పట్టణ పరిధి డోలపేటకు చెందిన చేబోలు సాయినిరంజన్ తెలిపారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. చిత్రాలయ యాప్ ప్రత్యేకతను వివరించారు. భువనేశ్వర్‌లో బీటెక్ చదువుకున్న తాను ఏదైనా కొత్తగా యాప్‌ను తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో యాప్ రూపొందించినట్లు చెప్పారు. ఎన్నో సందర్భాల్లో ఫొటోలు తీసుకున్నా అవి గెస్ట్‌లకు గాని, ఫొటోలు దిగిన వారికి గాని చేరవని తెలిపారు. అటువంటి ఇబ్బందుల్లేకుండా యాప్‌ను రూపొందించాలనే ఉద్దేశంతో రెండేళ్లు కష్టపడి చిత్రాలయ యాప్‌ను సొంతంగా రూపొందించానని తెలిపారు. ఏదైనా ఫంక్షన్ వద్ద ఈ యాప్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తే.. మన సెల్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ ఫంక్షన్‌కు సంబంధించిన అన్ని ఫొటోలు మన సెల్‌ఫోన్‌కు చేరడం ఈ యాప్ ప్రత్యేకత.


