రాజాం సిటీ: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని ఎస్‌ఎల్‌టీఎన్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నామని కళాశాల చైర్మన్ టి.తవిటినాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెక్ మహీంద్ర, అపోలో టైర్స్, కియా, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి పది కంపెనీల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈ మేళా జరుగుతుందని అన్నారు. ఉదయం 10గంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గృహ హింస కేసు నమోదు
సంతకవిటి: మండలంలోని మోదుగుల పేట గ్రామానికి చెందిన గార అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గృహ హింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనసూయకు మండలంలోని కాకరాపల్లి గ్రామానికి చెందిన గార రాంబాబుతో 2015లో వివాహం అయింది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు ఆమెను హింసిస్తున్నారని శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
రాములోరికి వైభవంగా సహస్రదీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవను ఆలయ అర్చకులు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిపించారు. శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


