● వర్షాభావంతో తగ్గిన దిగుబడి
● అడవికి వెళ్లి సీతాఫలాలు దొరకక ఖాళీ బుట్టలతో వెనుదిరుగుతున్న గిరిజనులు
● కుటుంబ పోషణపై గిరిజనుల ఆందోళన
పాచిపెంట: గిరిజనులకు అడవే జీవనాధారం. అడవిలో దొరికిన ఫలాలే ఆదాయ వనరులు. ఆర్థిక భరోసా. సీతాఫలాల సీజన్ వచ్చిందంటే తెల్లవారకముందే బుట్టలు, సంచులు పట్టుకుని అడవిబాట పట్టి.. రోజంతా సీతాఫలాలు సేకరించి సంతల్లో విక్రయించేవారు. సీజన్‌లో వచ్చే ఆదాయంతో ఇంటి సరుకులు, పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చుకునేవారు. ఈ ఏడాది పరిస్థితి తలకిందులైంది. వర్షాభావంతో సీతాఫలాల దిగుబడి తగ్గింది. ఆగస్టు చివరి వారం సమీపిస్తున్నా అడవుల్లో సీతాఫలాలు లభించక పోవడంతో గిరిజన కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
అడవికి వెళ్తే.. ఖాళీ బుట్టలే..
మండలంలోని శతాభి, మూటకూడు, గరిసిగుడ్డి తంగ్లం, పులిగుంటవలస, చిల్లమామిడి తదితర గిరిశిఖర ప్రాంతాల్లో ఏటా జూలై మొదటి వారం నుంచే సీతాఫలాల సందడి మొదలయ్యేది. చెట్లకు విరివిగా కాయలు కాయడంతో గిరిజనులు వాటిని సేకరించి సమీప సంతలకు తీసుకొచ్చేవారు. వ్యాపారులు సైతం గ్రామాలకే వచ్చి కాయలను కొనుగోలు చేసేవారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల ప్రభావం సీతాఫలాల దిగుబడిపై పడినట్లు గిరిజనులు చెబుతున్నారు. చెట్లకు కాయలు లేకపోవడంతో అడవికి వెళ్లినా బుట్టలు నిండడం లేదు. రోజంతా అడవిలో తిరిగినా ఆశించిన మేరకు కాయలు దొరకకపోవడంతో నిరాశగా ఇళ్లకు తిరిగి వస్తున్నారు.
సంతల్లో కనిపించని సీతాఫలాల గుట్టలు...
సాధారణంగా ఈ సమయానికి సంతల్లో ఎక్కడ చూసినా సీతాఫలాల గుట్టలే కనిపించేవి. గిరిజనులు తెచ్చిన కాయలను వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేసేవారు. దీంతో ఒక్కో కుటుంబానికి సీజన్‌లో వచ్చిన ఆదాయం కొంతకాలం ఆర్థికంగా అండగా నిలిచేది. ఈసారి మాత్రం సంతల్లో సీతాఫలాల సందడి లేకపోవడంతో ఆదాయంపై గిరిజన కుటుంబాలు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏటా సీతాఫలాల సీజన్ కోసం ఎదురుచూస్తాం. తెల్లవారుజామున అడవికి వెళ్లి రోజంతా కాయలు ఏరుకుని సంతలో అమ్మితే వచ్చే డబ్బుతో ఇంటి సరుకులు, పిల్లల అవసరాలు చూసుకునేవాళ్లం. ఈ సారి చెట్లకు కాయలు లేకపోవడంతో రోజంతా తిరిగినా ఖాళీ బుట్టలతోనే వస్తున్నాం. ఆదాయం లేకపోవడంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారుతోంది.
– దుమ్మరి నూకరాజు, పులిగుంటవలస


