● డాగ్ స్క్వాడ్‌తో సోదాలు
పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం డాగ్ స్క్వాడ్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు స్థానిక రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ పరిసర ప్రాంగణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సీసీఎస్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొమరాడ ఎస్సై జగదీష్, జీఆర్పీ, ఆర్‌పీఎఫ్, ఈగల్ టీమ్, సీసీఎస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ సాయంతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి విజయనగరం వరకు ప్రయాణించే గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలులో పోలీసులు అణువణువూ శోధించారు. ప్రధానంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు సారా సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి. రైలు బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల బ్యాగులను, వారి వద్ద ఉన్న సామగ్రిని డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
హాస్టల్‌ను తనిఖీచేసిన కలెక్టర్
సీతానగరం: మండలంలోని మరిపివలసలో గల ఎస్సీబాలికల వసతిగృహాన్ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాలు, వాతావరణం, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా ముచ్చటించారు. పాఠశాల వసతిగృహ నిర్వహణ సమర్థవంతంగా సాగేందుకు విద్యార్థుల్లో బాధ్యతాయుత ప్రవర్తన, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రతి తరగతితో పాటు పాఠశాల స్థాయిలో ప్రత్యేకంగా టీం లీడర్లును నియమించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని, వంటగదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన వారాంతపు మెనూ ప్రకారం ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలని వంటల తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే శాసీ్త్రయ ఆధారంలేని నాటువైద్యం వలన కలిగే ప్రమాదాలు,నష్టాలు గురించి విద్యార్థులకు వివరించి సరైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధురి, తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్,ఎంపీడీఓ ఎంఎల్‌ఎన్ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ వర్మ, వసతిగృహ సంక్షేమాధికారిణి జీవీఎస్ గౌరీశ్వరి, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయుడు రాయుడి శంకరరావు పాల్గొన్నారు.
మళ్లీ వచ్చిన ఏనుగులు
● ఆందోళనలో కొమరాడ రైతులు
కొమరాడ: ఇటీవల జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాల్లో సంచరించిన ఏనుగుల గుంపు మంగళవారం కొమరాడ మండలం పాత దుగ్గి, కళ్లికోట, గారవలస గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల్లో మళ్లీ సంచరిస్తున్నాయి. ఇన్నాళ్లూ గజరాజులు లేవని ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులను మళ్లీ గజరాజులు వచ్చి దడ పుట్టించాయి. వర్షాలు లేక చాలీచాలని నీటితో మోటార్ మీద పంటలు పండిస్తున్న తమకు మూలిగే నక్కపై తాటి పండు పడిన ట్లు ఏనుగులు వచ్చాయని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో గజరాజుల గుంపు ఎక్కడ నాశనం చేస్తాయోనని రైతులు భీతిల్లుతున్నారు.
భామినిలో..
భామిని: మండలానికి సరిహద్దుగా ఉన్న ఒడిశా గ్రామాల వైపు నడిచిన నాలుగు ఏనుగుల గుంపు తిరుగుముఖం పట్టింది. ఈ మేరకు మంగళవారం భామిని మండలం మనుమకొండ సమీపంలోకి చేరాయి. మనుమకొండ తోటల్లో తిష్ట వేసి పంటలు నాశనం చేస్తున్నాయని గిరిజన రైతులు వాపోతున్నారు.


